హైదరాబాద్, మహా : మేడ్చల్ ప్రాంతంలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ నంద కిశోర్, గోవింద్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో సీఎంఆర్ కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డితో సహా ఏడుగురిని నిందితులుగా చేర్చారు. 11, 12 సహా పలు సెక్షన్లతో పాటు పోక్సో కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గర్ల్స్ హాస్టల్లోని బాత్రూమ్ల్లోకి నిందితులు తొంగిచూసినట్లుగా విచారణలో గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే గర్ల్స్ బాత్రూమ్ల్లోకి గోవింద్, కిశోర్ తొంగిచూసినట్టు దర్యాప్తులో తేలింది. నిందితులు కిశోర్, గోవింద్ సహా ఐదుగురిపై కేసు నమోదైంది. ఎ 1 నిందితుడిగా నంద కిషోర్ కుమార్, ఎ 2 గా గోవింద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డిని ఎ 7 గా చేర్చారు. ఎ 5 గా ప్రిన్సిపాల్ అనిత నారాయణ, ఎ 6 గా కాలేజ్ డైరెక్టర్ మద్దిరెడ్డి జగన్ రెడ్డి, ఎ 4, ఎ 3గా హాస్టల్ వార్డెన్స్ అల్లం ప్రీతీ రెడ్డి, ధనలక్ష్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హాస్టల్ విద్యార్థినుల గురించి గోవింద్, కిశోర్ అసభ్యకరంగా మాట్లాడారని, విద్యార్థినులు నిందితులపై ఫిర్యాదు చేసినప్పటికీ కాలేజీ యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టకుండా వదిలేసిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దాంతో కాలేజీ యాజమాన్యంపై కూడా కేసులు నమోదు అయ్యాయి. విద్యార్థినుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ కాలేజీ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. గర్ల్స్ హాస్టల్ బాత్ రూంలో వీడియో రికార్డు చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కాలేజీ ఘటనపై విద్యార్థినిలు సహా ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. కాలేజీ ప్రాంగణమంతా అందోళన వాతావరణం నెలకొంది. దీనిపై స్పందించిన తెలంగాణ మహిళా కమిషన్ వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు సూచించింది. రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.





