Mahaa Daily Exclusive

  భక్తులకు కీలక సూచనలు 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం – టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

Share

ఏపీ: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తాజాగా పలు సూచనలు చేశారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సామాన్య భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా టీటీడీ అధికారులు, మునిసిపల్ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి శనివారం రామచంద్ర పుష్కరిణి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తులు సంయమనం పాటించి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. 10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు వీలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. జనవరి 10, 11, 12వ తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తారని తెలిపారు.

తిరుపతిలో ఇందిరా మైదానం, శ్రీనివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, రామచంద్ర పుష్కరిణి, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 13 నుంచి 19 వరకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లను జారీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, బారికేడ్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు తదితర వంటి పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు.

Latest