సొమ్మొకరిది. సోకు ఇంకొకరిది అన్నట్లుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ప్రధాని మోదీ ఈ నెల 8న ప్రారంభించే ప్రాజెక్టులన్నీ మేం తెచ్చినవే. రైల్వే జోన్, బల్క్ డ్రగ్ పార్క్, ఎన్టీపీసీని ఏపీకి తీసుకువచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుంది. మేం చెప్పేవాటికి జీవోలతో సహా అన్ని ఆధారాలున్నాయి. కానీ, ఆ ప్రాజెక్టులన్నీ మీరు సాధించినట్లు బిల్డప్ ఇస్తున్నారు. మంత్రి లోకేష్‌కు దమ్ముంటే అది నిజం కాదని చెప్పగలరా?. విశాఖ అభివృద్ధిపై లోకేష్ చెప్పినవన్నీ అబద్ధాలే. అవగాహన లేమీతో నోటికొచ్చినట్టు మాట్లాడాతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రపై ఎప్పుడూ నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఏనాడూ కూడా టీడీపీ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది మా ప్రభుత్వమే. ఈ అంశంపై బహిరంగ చర్చకు మేం సిద్ధం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 8న విశాఖపట్నంలో భూమి పూజ చేస్తున్న, ప్రారంభిస్తున్న ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వం చొరవతో సాధించనవే. అయినా అవన్నీ తమ ఘనతగా ఈ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది’ అమర్నాథ్ పేర్కొన్నారు.





