Mahaa Daily Exclusive

  రైతు భరోసా రూ. 15 వేలు ఇవ్వాల్సిందే – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Share

ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసి, ప్రతీకార పాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరతీశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆసిఫాబాద్ లో పర్యటనలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతీకార చర్యల్లో భాగంగానే కేటీఆర్ పై అక్రమ కేసులను నమోదు చేశారు. మేము కేసీఆర్ సైనికులం… దేనికి భయపడే ప్రసక్తే లేదు. మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం. ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. కేసీఆర్ హయాంలో మొదలుపెట్టిన కార్యక్రమాలు, పథకాలను ప్రభుత్వం కొనసాగించాలి. జైనూరులో అత్యాచారానికి గురైన బాధితురాలికి ప్రభుత్వం సరైన వైద్యం కూడా అందించలేదు. నిందితులకు ఇప్పటివరకు శిక్ష వేయించకపోవడం చాలా బాధాకరం. ఆ ఘటన జరిగినప్పుడు ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా బాధితురాలికి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వం స్పందించని కారణంగా హింస చెలరేగింది. దాంతో ఎన్నో దుకాణాలు దగ్ధమయ్యాయి. వాటికి ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వాంకిడి ఆశ్రమ పాఠశాలలో విషాహారం తిని శైలజ అనే విద్యార్థిని మృతి చెందడం చాలా బాధాకరం. శైలజ మరణించిన నేపథ్యంలో మేం రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన తర్వాత ప్రభుత్వం మేల్కొంది’ అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘రూ 2 లక్షలతో పాటు శైలజ తండ్రికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు శైలజ తండ్రికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ఇప్పటివరకు దాదాపు 57 మంది పిల్లలు చనిపోయిన ప్రభుత్వంలో చలనం లేదు. చాయ్ తాగినంత సులువుగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఏడాదికాలంగా ముఖ్యమంత్రి ఎన్ని చాయలు తాగారో తెలియదు కానీ… ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి మాత్రం ఆయన సమయం దొరకడం లేదు. ఆశ్రమ పాఠశాలల్లో, కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసి హక్కులపై కూడా ప్రభుత్వం శీతకన్ను వేస్తున్నది. ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా కింద ఏడాదికి ఎకరానికి రూ 15 వేలు ఇవ్వాల్సిందే. రూ .12 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే కుదరదు. గ్రామాల్లో గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్పితే.. కాంగ్రెస్ పచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు. గ్రామాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తక్షణమే చక్కదిద్దే ప్రయత్నం చేయాలి’ అంటూ కవిత పేర్కొన్నారు.

Latest