Mahaa Daily Exclusive

  భూ భారతికి గవర్నర్ ఆమోదం…!

Share

భూభారతి చట్టం అమలుకు దారి తీసిన ప్రతి అడుగు చారిత్రాత్మకమే. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రతీ సభలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లే దానిని విసిరేయగా, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి పట్టుదల, దీక్షతో కొత్త చట్టం రూపొంది ఇపుడు మరోదశకు చేరింది. రాష్ట్ర చరిత్రలో ఇదో మైలురాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టానికి ఆమోద ముద్ర పడింది. భూభారతి చట్టానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిసెంబర్ 20వ తేదీన భూభారతి బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించగా, డిసెంబర్ 30వ తేదీన గవర్నర్ కార్యాలయానికి భూభారతి బిల్లు చేరింది. గురువారం భూభారతి చట్టానికి ఆమోదం తెలుపుతూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే భూభారతి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. మార్గదర్శకాలపై సర్కార్ కసరత్తు చేస్తోంది. గ‌వ‌ర్నర్ ఆమోదించిన భూభార‌తి బిల్లు కాపీని గురువారం స‌చివాల‌యంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి న‌వీన్ మిట్టల్ అంద‌జేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా చ‌ట్టాన్ని అమ‌లులోకి తెస్తామన్నారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవ‌లు అందిస్తామని పేర్కొన్నారు. ఆర్వోఆర్ – 2020 వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు. తెలంగాణ భూ పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోన్న భూభారతి చట్టంకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం లభించింది. భూమి సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని అందించేందుకు రూపొందించిన ఈ చట్టం త్వరలో అమలులోకి రానుంది. రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ చట్టానికి సంబంధించిన కార్యాచరణ తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

పారదర్శక చట్టం

భూభారతి చట్టం అమలుకు దారి తీసిన ప్రతి అడుగు చారిత్రాత్మకమే. ఈ చట్టం ప్రవేశంతో రైతులు, సామాన్య ప్రజలు, గ్రామాల స్థాయి నుంచి పట్టణాల వరకు, రెవెన్యూ వ్యవస్థలో మార్పును అనుభవించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూ సమస్యలను పరిష్కరించి, భూ నిర్వహణలో పారదర్శకత, సమగ్రతను తీసుకురావడమే ఈ చట్టం లక్ష్యంగా ఉంది. తెలంగాణలో భూ సమస్యలు తరచుగా రైతులకు, సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. పాతతరపు రెవెన్యూ విధానాల వల్ల భూమి హక్కులపై అనేక వివాదాలు, న్యాయపరమైన సమస్యలు తలెత్తాయి. భూభారతి చట్టం అమలుతో ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభించనుంది. ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రజలకు భూ హక్కులపై పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

– గ్రామస్థాయి నుండి రెవెన్యూ సేవలు

భూభారతి చట్టం కింద గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలను మరింత సమగ్రంగా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించడం ద్వారా గ్రామస్థాయిలో భూమి నిర్వహణను పటిష్టం చేయనున్నారు. రెవెన్యూ సేవలు ప్రజలకు మరింత చేరువ అవ్వడంతో, భూమి సంబంధిత సేవలపై నమ్మకం పెరుగుతుందని భావిస్తున్నారు. గతంలో రెవెన్యూ చట్టాలు సరైన విధంగా అమలుకావడం లేదని, వాటి వల్ల రైతులు, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి విమర్శించారు. భూ సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపిస్తూ, భూభారతి చట్టం తీసుకురావడం ద్వారా నూతన శకానికి పునాదులు వేస్తున్నామని తెలిపారు. భూభారతి చట్టం కింద భూమి నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. భూమి రికార్డులను డిజిటలైజ్ చేసి, పారదర్శకంగా భూ హక్కులను గుర్తించనున్నారు. రైతులు, భూ యజమానులకు వారి హక్కులపై పూర్తి స్పష్టత లభించనుంది. భూమి లావాదేవీలు వేగంగా, న్యాయంగా జరిగే విధానానికి ఈ చట్టం దోహదపడుతుంది.
భూభారతి చట్టం తెలంగాణ భూమి పరిపాలనలో విశిష్ట దశగా నిలుస్తుందని ప్రజలంతా ఆశిస్తున్నారు.

Latest