గ్రేటర్ వరంగల్ నగరంలో వంద శాతం పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మేయర్ సర్కిళ్లు, వార్డుల వారీగా ఆస్తి, పన్నుల సేకరణ, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పురోగతి పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, నివాస గృహాలు వాణిజ్య సంస్థల నుండి వసూలు చేసిన పన్నుల వివరాలను వార్డుల వారీగా అడిగి తెలుసుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.114 కోట్ల 44 లక్షల పన్ను వసూలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం రూ. 42 కోట్ల 59 లక్షల రూపాయలు వసూలు చేశారని, మిగిలిన పన్నుల సేకరణ లక్ష్యాన్ని సాధించుటకు ప్రణాళిక బద్ధంగా సమష్టిగా కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై సమీక్షిస్తూ ఇప్పటివరకు జీడబ్ల్యూ ఎంసీ పరిధిలో 93 శాతం సర్వే పుర్తయిందని, పెండింగ్ లో ఉన్న డివిజన్లలో లేనివారిని పిలిపించి వివరాలు సేకరించి త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని మేయర్ అన్నారు. ఈ సమీక్షలో ఆదనవు కమిషనర్ జోనా, ఉప కమిషనర్లు కృష్ణ రెడ్డి, రవీందర్, పన్నుల అధికారి శ్రీనివాస్, ఐటీ మేనేజర్ రమెష్,ఆర్ ఓలు శ్రీనివాస్, శహజాది బేగం, యూసుఫ్ ఉద్దీన్, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.





