Mahaa Daily Exclusive

  ఊరికి వెళ్లే ప్రజలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు -పోలీస్ కమిషనర్ కేపివీ రాజ్

Share

సంక్రాంతి పండగ సందర్భంగా సొంత ఊరికి వెళ్ళే ప్రజలకు దొంగతనాల నివారణ గురించి, ఇబ్రహీంపట్నం పోలీస్ కమిషనర్ కేపివీ రాజ్ ముఖ్య సూచనలు చేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయం పరిధిలోని ప్రజలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి వెళ్ళే సమయంలో వీలైనంత మేరకు ఇంటిలో విలువైన వస్తువులు, నగదు మరియు బంగారం ఆభరణాలు పెట్టకుండా, వాటిని బ్యాంకు లాకర్లో లేదా భద్రంగా ఉన్న చోట దాచుకోవడం ఉత్తమం అని అన్నారు. బీరువా తాళం చెవులు బీరువా పైన కానీ, బీరువాలోని బట్టల క్రింద, ఇంట్లో పెట్టి వెళ్లవద్దని సూచించారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటి వద్ద ఉండే వాహనాలను పార్క్ చేసి తాళం చెవులు వెంట తీసుకుని వెళ్తే మంచిదని తెలిపారు. ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దని, తాళం కనపడకుండా పరదాను అడ్డుగా వేయాలన్నారు. ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచాలని సూచించారు. ఇంటి గేటుకు లోపల నుంచి తాళం వేయండని పేర్కొన్నారు. బయటకు వెళ్ళేటపుడు ఇంట్లో, బయట లైట్ వేసి, పేపర్ బాయ్, పాలు వేసే వాళ్లకు రావద్దని చెప్పాలన్నారు. నమ్మకమైన వ్యక్తిని కాపలదారుడిగా నియమించుకోవాలని సూచించారు. ఊరికి వెళ్ళేటప్పుడు మీకు నమ్మకమైన వారికి, అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందివ్వడం తప్పనిసరి అని తెలిపారు. ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటి పక్క వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటూ ఉండాలన్నారు. ముఖ్యంగా చైన్స్ స్నాచర్స్ కారణంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు, వాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు మెడలోని బంగారు ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలని, వీలైతే చీర కొంగుతో కవర్ చేసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాలనీలోని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉందని, భద్రత ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు సొంతంగా ఏర్పాటు చేసుకుని డీవీఆర్ ని రహస్య ప్రదేశాలలో భద్రపర్చుకోవాలన్నారు. మొబైల్ యాప్ ద్వారా ఇంటిలో ఉన్న సీసీకెమెరాల దృశ్యాలు ఎప్పటికప్పుడు వీక్షిస్తూ ఉండాలని, ఏమైనా అనుమానం కలిగినట్లు అనిపిస్తే, సమీపంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని తెలిపారు. బస్సు లేదా, రైలు ప్రయాణ సమయంలో అపరిచిత వ్యక్తులు ఇచ్చిన తిను బండారాలు తీసుకోకూడదని, మీ వెంట విలువైన వస్తువులను తీసుకుని వెళుతున్నట్లయితే అట్టి బ్యాగును మీ దగ్గరే జాగ్రత్తగా అంటి పెట్టుకుని ఉంచుకోవాలన్నారు. మీరు బయటికి వెళ్ళే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయవద్దంటూ హెచ్చరించారు. ఎవరిమీదైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు గానీ, రాచకొండ పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 62666కు లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ 8712662111కు డయల్ చేయమని ఇబ్రహీంపట్నం ఏసీపీ తెలిపారు.