బీఆర్ఎస్ పార్టీలో రౌడీలకు కొదవ లేదని, రౌడీల పార్టీ బీఆర్ఎస్ అని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాను తనది కాస్త రౌడీ మెంటాలిటీ అంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె రౌడీ కాబట్టే ఢిల్లీ వెళ్ళి లిక్కర్ దందాకు దిగి ఈడీ కేసులో ఇరుక్కుందని వ్యాఖ్యానించారు. గాంధీ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశఁలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. హెచ్ సీయూ భూములు బీఆర్ఎస్ హయంలో ప్రభుత్వ భూముల అమ్మకాలకు సంబంధించిన అంశఁపై చర్చించేందుకు సిద్దమన్నారు. మీడియా సమక్షంలో చర్చిద్దామని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ తన సవాల్ ను స్వీకరించాలన్నారు. హెచ్ సీయూ భూముల గురించి మాట్లాడడానికి కేటీఆర్ కి సిగ్గుండాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పును వక్రీకరిస్తున్న కేటీఆర్, హరీష్ రావు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా? అని ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలి భూములను ప్రైవేట్ పరం చేసే ఆలోచన ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితులలో లేదన్నారు. భూములకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు విషయాన్ని కేటీఆర్, హరీష్ రావు పక్క దారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. హెచ్ సీయూ భూముల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా దాదాపు 5 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకోవడమే బీఆర్ఎస్, బీజేపీ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూములను చౌకగా అమ్మేశారని, గతంలో అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ కి కోర్టులు మొట్టికాయలు వేసిందో గుర్తు తెచ్చుకోవాలన్నారు. కోర్టులంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవమని, కోర్టు నిర్ణయాలకు లోబడే పని చేస్తామన్నారు. హెచ్ సీయూ భూములపై ఏఐ టెక్నాలజీతో సృష్టించిన ఫేక్ వీడియోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రిట్వీట్ చేశారన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం భూములకు సంబంధించి అవాస్తవాలు మాట్లాడారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని సీఎం పదవిని నుంచి దిగిపొమ్మటానికి కేటీఆర్ ఎవరని, ఆ మాటలనేందుకు కనీసం సిగ్గైనా ఉండాలన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయే సంక్షేమ, అభివృద్ది పథకాలను అమలు చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోవాలా కేటీఆర్ చెప్పాలన్నారు.
