దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన భాజపా నేత పరాగ్ షా నిలిచారు. ముంబయిలోని ఘాట్కోపర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) చేసిన విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. భారతదేశంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.1413 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది. ఇక అత్యంత పేద ఎమ్మెల్యేగా బంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.1700 కావడం విశేషం.
ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 4,092 ఎమ్మెల్యేల ఆర్థిక వివరాలను, వారిపై ఉన్న కేసులను విశ్లేషించింది. దస్త్రాలు సరిగ్గా స్కాన్ చేయకపోవడం వల్ల 24 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించలేకపోయినట్లు ఏడీఆర్ పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని ఏడు అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువ రూ.931 కోట్లు కాగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి ఆస్తువ విలువ రూ.757 కోట్లు, ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే పి.నారాయణ ఆస్తుల విలువ రూ.824 కోట్లు అని ఏడీఆర్ పేర్కొంది.








