అతి పెద్ద అంతర్జాతీయ క్రీడా సంరంభం ఒలింపిక్స్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రీడా మహోత్సవానికి ఫ్రాన్స్ రాజధాని పారిస్ ఆతిథ్యమిస్తోంది. పారిస్ ఒలింపిక్స్-2024 జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.
కాగా, పారిస్ ఒలింపిక్స్ కు భారత్ భారీ బృందాన్ని పంపుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీల్లో భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. తాజాగా, ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల జాబితాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
అయితే ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన మహిళా షాట్ పుటర్ అబా కథువా పేరును ఈ జాబితా నుంచి తొలగించారు. కేంద్రం ఆమోదించిన జాబితాలో ఆమె పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, భారత అథ్లెట్లతో పాటు 140 మందితో కూడిన సహాయక సిబ్బంది, అధికారుల బృందం కూడా పారిస్ వెళ్లనుంది. ఈసారి అందరి దృష్టి భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే ఉండనుంది. చోప్రా 2021 ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో అంశంలో స్వర్ణం చేజిక్కించుకుని చరిత్ర సృష్టించడం తెలిసిందే.
ఇటీవల కొంతకాలంగా ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలోనూ భారత అథ్లెట్లు రాణిస్తుండడంతో… పారిస్ ఒలింపిక్స్ లో ఆయా క్రీడాంశాల్లో పతకాలపై ఆశలు కలుగుతున్నాయి. ప్రధానంగా భారత్ రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, హాకీ, ఆర్చరీ క్రీడాంశాల్లో పతకాలను ఆశిస్తోంది.