Mahaa Daily Exclusive

  రోడ్ల అభివృద్ధి కోసం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆందోళన…!

Share

ఖమ్మం అర్బన్, మహా.
ఖమ్మం నగరంలోని వన్‌టౌన్ డివిజన్ పరిధిలోని కైకొండయ్యగూడెం గ్రామంలోని విద్యానగర్ రైల్వే కాలనీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, సిసి రోడ్లు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ వన్‌టౌన్ కార్యదర్శి జె.లెనిన్ మాట్లాడుతూ, “గ్రామం పాలేరు నియోజకవర్గానికి చెందడం, కార్పొరేషన్ పరిధిలో ఉండడం, ఇద్దరు మంత్రుల ప్రాతినిధ్యం కలిగి ఉన్నప్పటికీ, అభివృద్ధి మాత్రం నసనసలాడుతోంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్లపై బురద మయమైన ప్రాంతాల్లో నాట్లు వేసి నిరసన తెలియజేశారు. ప్రజలు నడవలేని పరిస్థితులు నెలకొన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడాన్ని విమర్శించారు. “ఇళ్ల నిర్మాణానికి ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు చేసి పర్మిషన్లు తీసుకుంటున్నారు. ఇంటి పన్నులు కడుతున్నారు. కానీ వారికి కనీస రోడ్డు సదుపాయం కల్పించకపోవడం అన్యాయమైంది” అని చెప్పారు.

ఈ ప్రాంతానికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఇద్దరూ నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే మంత్రి పర్యటన జరగాలని, రోడ్ల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇంకా స్పందించకపోతే, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు కె.శ్రీనివాస్, ఇమ్మడి వెంకటేశ్వర్లు, ములకలపల్లి లక్ష్మీనారాయణ, జిక్కుల భరత్, ధరణ్ కృష్ణ, బొమ్మకంటి రమేష్, కాటబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.