ఏడవరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టగా.. కేటీఆర్ దానిపై చర్చ ప్రారంభించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని ఆర్బీఐ చెబుతోందని, దేశంలో తెలంగాణ జీడీపీ వృద్ధి చెందిందని తెలిపారు. కానీ ఎన్నికలు పూర్తయ్యాక కూడా కాంగ్రెస్ గత ప్రభుత్వ పాలనపై బురద చల్లడం సబబు కాదన్నారు. గత ప్రభుత్వంలో అప్పులే ఉన్నాయని చెప్పడం సరికాదన్న ఆయన.. ఆస్తుల గురించి ఎప్పుడూ చెప్పరెందుకని అసెంబ్లీలో ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ లో అప్పగించామని కేటీఆర్ తెలిపారు. మిగులు బడ్జెట్ లో ఇచ్చిన రాష్ట్రంపై కూడా.. ఇప్పటి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పుగా ఉన్నాయని ఆరోపించారు. ఉద్యమాలతో వచ్చిన తెలంగాణ.. ఉజ్వలంగా వెలుగుతోందన్నారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థికవ్యవస్థ కాస్త అస్తవ్యస్తమయిందన్నారు.
మాట్లాడితే గత ప్రభుత్వం అప్పులు చేసిందంటూ.. ప్రచారం చేయడం తగదన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరుగ్యారెంటీలపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. విపక్షంలో ఉండగా తెలంగాణ అభివృద్ధిని ప్రశంసించిన భట్టి.. ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారన్నారు. రైతుల రుణమాఫీ కోసం కాంగ్రెస్ సర్కార్ బాగా పనిచేస్తుందని అభినందించారు కేటీఆర్.
గత ప్రభుత్వం అప్పులు చేయకపోతే.. రెవెన్యూ లోటు లేకపోతే ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు ఎందుకు ఇవ్వలేదని మంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
ద్రవ్యవినిమయ బిల్లుపై విస్తృత చర్చ జరగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదని విమర్శించారు. కాగా.. అసెంబ్లీలో అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని, సభా సమయాన్ని వృథా చేయవద్దని మంత్రి శ్రీధర్.. కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు.