తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత జిష్ణు దేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి కంగ్రాట్స్ చెప్పారు.
తెలంగాణ రాజ్‌భవన్‌లో ఈ రోజు సాయంత్రం జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందర రాజన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమె తమిళనాడు నుంచి లోక్ సభు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్ ఇంచార్జీగా ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయనను మహారాష్ట్రకు బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నూతన గవర్నర్‌గా జిష్ణ దేవ్ వర్మను నియమించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇందుకు సంబంధించి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
జిష్ణు దేవ్ వర్మ త్రిపుర మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. త్రిపుర శాసనసభకు పలుమార్లు ఎన్నికైన జిష్ణు దేవ్ వర్మ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ పని చేశారు. ఆయన రామజన్మ భూమి ఉద్యమ సమయంలో బీజేపీలో కూడా చేరడం గమనార్హం.