పారిస్ ఒలింపిక్స్ లో తెలుగుతేజాలు పీవీ సింధు (బ్యాడ్మింటన్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్) ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఇవాళ జరిగిన గ్రూప్-ఎం మ్యాచ్ లో సింధు 21-5, 21-10తో ఎస్తోనియాకు చెందిన క్రిస్టిన్ కూబాపై అలవోకగా నెగ్గింది.
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు ముందు పెద్దగా అనుభవంలేని క్రిస్టిన్ కూబా ఏమాత్రం నిలవలేకపోయింది. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగియడం చూస్తే సింధు జోరు అర్థమవుతుంది. ఈ విజయంతో సింధు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన సింధు ప్రీ క్వార్టర్స్ లో చైనాకు చెందిన హీ బింగ్జియావోతో తలపడనుంది.
ఇక టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కూడా ముందంజ వేసింది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో శ్రీజ ప్రీక్వార్టర్స్ చేరింది. ఇవాళ జరిగిన గ్రూప్ మ్యాచ్ లో శ్రీజ 4-2 తేడాతో సింగపూర్ క్రీడాకారిణి జెంగ్ ను ఓడించింది.
ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్ లో ప్రీక్వార్టర్స్ చేరిన రెండో భారత క్రీడాకారిణిగా ఆకుల శ్రీజ ఘనత సాధించింది.