- కారు కావాలా… బుల్టోజర్ కావాలా
- జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలన్న కేటీఆర్
- కాంగ్రెస్ ఓటుకు రూ.10 వేలు అచ్చేందుకు సిద్దమైందని వ్యాఖ్య
- రాష్ట్రానికి పనికి రాని పార్టీ బీజేపీ అని కామెంట్
హైదరాబాద్, మహా : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితులలో గెలవాలన్న సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ. 10 వేలు ఇచ్చేందుకు సమాయాత్తమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీజేపీ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడడుతూ, జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తదన్నారు. రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్లో ఖర్చుపెడతారని, ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ.10వేలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందన్నారు.
బీజేపీ రాష్ట్రానికి పనికిరాని పార్టీని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని అన్నారు. హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలంటే కేసీఆర్ తిరిగి రావాలని, అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు రూ.4 వేల పెన్షన్లు వస్తాయన్నారు. ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు, కానీ రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయల అప్పుల్ని మాత్రం చేసిందని అన్నారు. గరీబోళ్ల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి, హైదరాబాద్లో ఇళ్లు కూలగొడుతున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని అన్నారు. కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేవీ చూడకుండా పేదవాళ్ళ ఇండ్లపైకి బుల్డోజర్లను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డికి అన్నీ తెలుసని, అయినా మోసం చేశారని విమర్శించారు. పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని తెలుసు. ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేస్తుందని కూడా తెలిసి మరీ బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడి మోసం చేశారని మండిపడ్డారు. ఓట్ల కోసం బీసీలను పావులుగా మవాడుకుని వదిలేయాలన్న కాంగ్రెస్ పార్టీ ప్లాన్ అట్టర్ ప్లాఫ్ అయిందన్నారు.






