Mahaa Daily Exclusive

  డీలిమిటేషన్‌ వద్దు..! తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ తీర్మానం..

Share

•తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ తీర్మానం

•డీలిమిటేషన్ తో నష్టం జరుగుతుందన్న దళపతి

చెన్నై, మహా : లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజనకు (డీలిమిటేషన్) వ్యతిరేకంగా సీఎం విజయ్ బుధవారం తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్‌కు తాము అంగీకరించేదే లేదని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్న తమిళనాడుకు డీలిమిటేషన్‌తో నష్టం జరుగుతుందని అన్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గ పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ నష్టమని చెప్పారు. ఈ తీర్మానంలో సీఎం విజయ్ మొత్తం మూడు డిమాండ్స్‌ను కేంద్రం ముందుంచారు. లోక్‌సభ సీట్ల సంఖ్యను ఎప్పటికీ 543 వద్ద స్తంభింపజేయాలని అన్నారు. రాష్ట్రాలకు ప్రస్తుతమున్న ఎంపీ సీట్ల సంఖ్యను శాశ్వతం చేయాలని అన్నారు. రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తీసుకురావాలని అన్నారు. ఇటీవల పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల్లో రాజకీయ సమీకరణాల మార్పులతో ఎన్డీయే బలం మరింత పెరిగిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో, కేంద్రం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చేందుకు మరోసారి ప్రయత్నిస్తుందన్న కామెంట్స్ వచ్చాయి. అయితే, డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Latest