•వర్మ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొన్న కమిటీ
•నగదును వర్మ స్వయంగా తొలగించారనడానికి ఆధారాలు లేవన్న కమిటీ
•కీలక ఆధారాలను సరిగ్గా భద్రపరచలేదని దర్యాప్తుపై ప్యానెల్ ఆగ్రహం
న్యూఢిల్లీ, మహా : ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు నగదు వ్యవహారంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అధికారిక నివాసంలో భారీగా కాలిపోయిన నగదు లభించిన కేసులో వర్మ వివరణ సంతృప్తికరంగా లేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన కమిటీ తేల్చింది. ఈ మేరకు బుధవారం పార్లమెంటులో సమర్పించిన నివేదికలో ఆయన్ను దోషిగా పేర్కొంది. 2025 మార్చి 14న ఢిల్లీలోని తుగ్లక్ క్రెసెంట్‌లో ఉన్న వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి ఓ స్టోర్‌రూమ్‌లో భారీగా కాలిపోయిన రూ.500 నోట్ల కట్టలు కనిపించాయి. నగదు అక్కడికి ఎలా వచ్చింది? దాని మూలం ఏంటి? ఎవరిది? అనే అంశాలపై వర్మ ఇచ్చిన వివరణను కమిటీ తిరస్కరించింది. వర్మ ఇచ్చిన సమాధానాల్లో పారదర్శకత లేదని కమిటీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై 2025 మార్చి 22న ఆయన ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని నివేదికలో పేర్కొంది. అయితే కీలక విషయమొకటి కూడా కమిటీ స్పష్టం చేసింది. నగదును వర్మ స్వయంగా అక్కడి నుంచి తొలగించారనడానికి ఆధారాలు లభించలేదని తెలిపింది. నగదు లభించిన తర్వాత దర్యాప్తులో ఆధారాలను సరిగ్గా భద్రపరచలేదని కమిటీ తప్పుబట్టింది. స్టోర్‌రూమ్‌ను చట్టబద్ధంగా సీల్ చేసి తనిఖీ చేయకముందే అక్కడి సిబ్బంది కదలికలతో కీలక ఆధారాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. అనంతరం నగదు కనిపించకుండా పోవడం లేదా అందుబాటులో లేకపోవడానికి కారణం కూడా స్పష్టంగా తెలియలేదని తెలిపింది. అప్పటి సీజేఐ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ కూడా వర్మకు ఆ స్టోర్‌రూమ్‌పై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నియంత్రణ ఉందని తేల్చింది. వివాదం తర్వాత వర్మను అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపారు. అనంతరం ఆయన రాజీనామా చేశారు.







