- నేడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్
- ఇవాళ్టి నుంచి 21 వరకు నామినేషన్లు స్వీకరణ
- నవంబర్ 11న పోలింగ్.. 14న కౌంటింగ్
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు (నేడు) సోమవారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే.. సోమవారం నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈనెల 22న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాధ్ సతీమణి సునీతను బరిలోకి దింపగా..కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఎవరన్నది త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఆ పార్టీ నుంచి జూటూరు కిర్తిరెడ్డి, లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పద్మ, మాధవీలత, అలపాటి లక్ష్మీనారాయణ రేసులో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.






