- కూలి కోసం వెళ్లిన మహిళపై హత్యాచారం
- లైంగికదాడి.. చీరతో చేతులు కట్టేసి దాడి చేసిన దుండగులు
- ఆసుపత్రిలో మృతి చెందిన బాధితురాలు.
మెదక్, మహా: కూలి పనుల కోసం వెళ్లిన ఓ మహిళపై దుండగులు పాశవికంగా లైంగికదాడి చేయడంతోపాటు… అతి దారుణంగా హింసించి ఆమె మృతికి కారణమైన సంఘటన ఇది. అటవీ ప్రాంతంలో జరిగిన ఈ దారుణం ఒకరోజు ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు గమనించిన సమయానికి కొన ఊపిరితో ఉన్న బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేక కన్నుమూసింది. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధి అప్పాజీపల్లి శివారులో జరిగిన ఈ ఘటనపై ఎస్సై అహ్మద్ మొహియుద్దీన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెదక్ మండలంలోని ఓ తండాకు చెందిన మహిళ శుక్రవారం ఉదయం కూలి కోసం మెదక్ వెళ్లింది. అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు ఆమెకు మాయమాటలు చెప్పి ఏడుపాయల వైపు అటవీప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడ సామూహికంగాఅత్యాచారం చేశారు. అనంతరం దుండగులు ఆమె చీరతోనే రెండు చేతులను కట్టేసి తీవ్రంగా కొట్టి పరారయ్యారు. నిస్సహాయ స్థితిలో ఆమె రాత్రంతా అడవిలోనే స్పృహ లేకుండా పడి ఉంది. శనివారం స్థానికులు కొందరు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే డీఎస్పీ ప్రసన్నకుమార్ ఘటనా స్థలానికి వెళ్లి బాధితురాలిని పోలీసు వాహనంలో మెదక్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సమాచారం తెలిసి.. బాధితురాలి భర్త, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమెను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దుండగులను పట్టుకుంటామన్నారు.








