తిరుమలలో ఎప్పటికప్పుడు కొత్త విధానాలను ప్రవేశపెడుతూ భక్తుల ప్రశంసలను అందుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా సరికొత్త టెక్నాలజీ వినియోగించి శ్రీవారి లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేయనుంది. డిఫెన్స్ పరిశోధన బృందం ఆమోదించిన ఎకో ఫ్రెండ్లీ బ్యాగుల్లో లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనుంది. డీఆర్‌డీఓలో పనిచేసే సైంటిస్ట్ డాక్టర్ కె.వీరబ్రహ్మం బృందం పెట్రోలియం ఉత్పత్తులు మరియు కొన్ని మొక్కల నుంచి వెలువడే నూనెతో బైయోడిగ్రేడబుల్ పాలిమర్ బ్యాగ్స్‌ను తయారు చేశారు. ఇకనుంచి ఈ బ్యాగ్స్‌లో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు.
పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్‌ను దాదాపుగా 40 పరిశ్రమలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సంచులు బాగుండటంతో దీన్ని ప్రసాదం పంపిణీ కోసం వినియోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ణయం తీసుకుంది. ఈ బయోడీగ్రేడబుల్ సంచులు మూడు నెలల తర్వాత వాటికంతకు అవే డిగ్రేడ్ అవుతాయి.
కొన్ని నెలల క్రితం డీఆర్‌డీఓ ఛైర్మెన్ సతీష్ రెడ్డి అప్పటి టీటీడీ ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి,అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డితో కలిసి తిరుమలలో కౌంటర్‌ను ప్రారంభించారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ త్వరలో ఇతర పర్యాటక ప్రాంతాల్లో అమలు చేస్తామని, తీర ప్రాంతాల్లో కూడా వినియోగిస్తామని చెప్పారు డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు. అంతేకాదు ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ వినియోగాన్ని ప్రమోట్ చేసి అవగాహన కల్పిస్తామని శాస్త్రవేత్త వీరబ్రహ్మం చెప్పారు.
పర్యావరణానికి ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ ఎలాంటి హాని తలపెట్టవని వీరి పరిశోధనలో తేలింది. మూడు నెలల్లోనే ఈ బ్యాగులు వాటంతకవే కుళ్లిపోతాయని,ఎలాంటి హానికరమైన అవశేషాలు ఉండవని నిర్థారించారు.బయోడిగ్రేడబుల్ బ్యాగులను మెడికల్ వేస్ట్ బ్యాగ్‌లుగా, అప్రాన్‌లుగా, చెత్తను వేసే బ్యాగులుగా, నర్సరీ బ్యాగులుగా, ష్రింక్ ఫిల్మ్‌లు, ప్యాకింగ్ ఫిల్మ్‌ల కోసం వినియోగించొచ్చని వీరబ్రహ్మం తెలిపారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ హక్కుల పొందేందుకు పలు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
ప్రమాదకరమైన ప్లాస్టిక్ బ్యాగ్స్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణహితమైన బ్యాగులను తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీలో విస్తృతమైన పరిశోధనలు నిర్వహించింది.