Mahaa Daily Exclusive

  సర్పంచ్ ఎన్నికలకు లైన్ క్లియర్..! జీవో 46పై స్టే నిరాకరించిన హైకోర్టు..

Share

  • ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
  • విచారణ ఎనిమిది వారాలకు వాయిదా

 

హైదరాబాద్, మహా : పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియరైంది. ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం వెనుక బడిన కుల సంఘాలు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్పై వాదనలను న్యాయవాది సుదర్శన్ వినిపించారు. చట్ట విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడానికి జీవో తీసుకువచ్చారని పిటిషన్ పేర్కొన్నారు.

 

బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ కేటాయించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టం 285ఏ సవరణ చేశాక ఒక ఎన్నిక జరిగింది కాదని సీజే తెలిపారు. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఇప్పుడు ఎందుకు సవాల్ చేస్తున్నారని సీజే ధర్మాసనం అడిగింది. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. ఇందుకు సంబంధించిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ కోరారు. ఈ అంశాన్ని తదుపరి విచారణలో పరిశీలిద్దామని సీజే చెప్పారు. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్ల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. బీసీలలో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైందని, ఈ దశలో స్టే విధించలేమని తేల్చి చెప్పింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యాక ఎందుకు సవాల్‌ చేస్తున్నారని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు స్టే నిరాకరించడంతో ఎన్నికల ప్రక్రియకు సజావుగా సాగేందుకు అవకాశం ఏర్పడింది. ఎన్నికల సంఘం షెడ్యుల్‌ ప్రకారం డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్14 రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత పోలింగ్ జరగనుంది.

 

ఎన్నికలు సజావుగా సాగేలా లీగల్ సెల్

 

గ్రామ పంచాయతీ ఎన్నికలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‍లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేసింది. ఈ లీగల్ సెల్‌లో సూపరింటెండెంట్ స్థాయి అధికారులను నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. అనుకున్న సమయంలోపు ఎన్నికలు సజావుగా పూర్తిచేసే విధంగా ఈ లీగల్ సెల్ పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకోసం లీగల్ సెల్.. జిల్లాలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది.

 

మహబూబ్ పట్నం గ్రామంలో ఎన్నికలపై హైకోర్టు స్టే

 

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహబూబ్‌‌పట్నం సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్, మూడు వార్డు స్థానాలు ఎలా రిజర్వ్ చేశారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కాగా, ఈ రిజర్వేషన్లు మార్చాలని గ్రామానికి చెందిన యాకూబ్‌, శ్రీకాంతాచారి, లింగయ్య, విజయ్‌, వెంకటమల్లు, పోలు నాగయ్య అనే వ్యక్తులు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు స్టే విధించింది.

Latest