Mahaa Daily Exclusive

  ఎన్నికలపై స్టే ఇవ్వలేం..! ఎలక్షన్ ప్రక్రియకు లైన్ క్లియర్..!

Share

  • ఎలక్షన్ ప్రక్రియకు లైన్ క్లియర్
  • జీవో 46 అమలు నిలిపివేతకు హైకోర్టు నో
  • జీవో 46పై అభ్యంతరాలను తోసిపుచ్చిన ధర్మాసనం
  • రాజ్యాంగ ప్రక్రియను ఇప్పుడు ఆపకూడదని హైకోర్టు వ్యాఖ్య

 

హైదరాబాద్, మహా: పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ పలు బీసీ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం- 2018లోని సెక్షన్ 285-ఏని, అలాగే నవంబర్ 22న జారీ చేసిన జీవో నంబర్ 46ని కొట్టివేయడానికి నిరాకరించింది. వివరాలు… రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గ్రామ పంచాయితీ ఎన్నికలపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ‘‘రాజ్యాంగ నిబంధనల ద్వారా ఆదేశించబడిన ప్రక్రియను ఆపకూడదు’’ అని పేర్కొంది. ఎన్నికలను నిలిపివేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ధర్మాసనం.

 

వర్గీకరణ చేపట్టకపోవడంతో రిజర్వేషన్లు తగ్గాయి..

ఇరువైపు వాదనలు విన్న కోర్టు…. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22వ తేదీన జీవో 46ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. జనాభా గణాంకాలు లేకుండా రిజర్వేషన్లు కేటాయించారని…. ఏ ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కేటాయించరన్నదానిపై స్పష్టత లేదని పేర్కొన్నారు. బీసీ జనాభాకు సంబంధించి ప్రత్యేక కమిషన్‌ సమర్పించిన వివరాలను వెల్లడించలేదని పిటిషన్ లో ప్రస్తావించారు. బీసీల్లో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేపట్టకపోవడంతో రిజర్వేషన్లు తగ్గాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీవో 46 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై గురువారం విచారించిన కోర్టు… శుక్రవారం కూడా వాదనలు వినింది. ఇరువైపు వాదనలు విన్న తర్వాత…స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఉన్నత న్యాయస్థానం స్టే ఇవ్వకపోవటంతో…. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుకు సాగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన తేదీల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… డిసెంబర్ 11,14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం మొదటి విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి.

Latest