- ఉద్యోగులకు గుడ్ న్యూస్.
- 2026లో సెలవుల జాతర.
- కేంద్రం విడుదల చేసిన భారీ సెలవుల జాబితా ఇదే.
హైద్రాబాద్, మహా.
మరో నెల రోజుల్లో 2025 సంవత్సరం ముగిసి, కొత్త సంవత్సరం అడుగుపెట్టనుంది. ఇప్పటికే పాఠశాలలు క్రిస్మస్ సెలవులను ఖరారు చేయగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు తీపి కబురు అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను కేంద్రం అధికారికంగా విడుదల చేసింది. వచ్చే ఏడాది పర్యటనలు, శుభకార్యాలు, ఇతర వ్యక్తిగత పనులను ప్లాన్ చేసుకునే వారికి ఈ క్యాలెండర్ ఎంతగానో ఉపయోగపడనుంది. విశేషమేమిటంటే, ప్రస్తుత సంవత్సరంతో పోలిస్తే 2026లో సెలవుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ కొత్త క్యాలెండర్ ప్రకారం మొత్తం 14 తప్పనిసరి సెలవులు ఉండగా, మరో 12 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి.
సంవత్సర ఆరంభం నుంచే పండుగ సందడి మొదలుకానుంది. జనవరి నెలలో 1వ తేదీన నూతన సంవత్సరం, 14న సంక్రాంతి, 23న వసంత పంచమి, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవులు ఖరారు చేశారు. ఇక ఫిబ్రవరి నెలలో 1న గురు రవిదాస్ జయంతి, 15న మహాశివరాత్రి, 19న ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సెలవులు ఉన్నాయి. మార్చి నెలలో పండుగలు అధికంగా ఉన్నాయి. మార్చి 4న హోలీ, 19న ఉగాది, 21న రంజాన్, 26న శ్రీరామ నవమి, 31న మహావీర్ జయంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు. ఏప్రిల్లో 3న గుడ్ ఫ్రైడే, 5న ఈస్టర్, 14న అంబేద్కర్ జయంతి సెలవులు ఉండనున్నాయి.
వేసవి మరియు వర్షాకాలం సెలవుల విషయానికి వస్తే, మే 1న బుద్ద పౌర్ణమి, 9న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, 27న బక్రీద్ సెలవులు ఉన్నాయి. జూన్ 26న మొహర్రం సెలవు ఇచ్చారు. ఆగస్టు నెలలో 15న స్వాతంత్ర దినోత్సవం, 26న మిలాద్ ఉన్ నబి మరియు ఓణం, 28న రక్షాబంధన్ సెలవులు ఖరారు చేశారు. సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి, 14న వినాయక చవితి పండుగలు జరుపుకోనున్నారు. అక్టోబర్ నెలలో గాంధీ జయంతి (అక్టోబర్ 2)తో పాటు, 18, 19, 20 తేదీల్లో దసరా సెలవులు వరుసగా రావడం ఉద్యోగులకు కలిసొచ్చే అంశం.
సంవత్సరాంతంలో వచ్చే పండుగలకు కూడా కేంద్రం స్పష్టమైన తేదీలను ప్రకటించింది. నవంబర్ 8న దీపావళి, 15న చఠ్ పూజ, 24న గురునానక్ జయంతి సెలవులు ఉన్నాయి. డిసెంబర్ 25న యధావిధిగా క్రిస్మస్ సెలవు ఉంటుంది. ఈ ప్రభుత్వ సెలవులతో పాటుగా ఏడాది మొత్తంలో 52 ఆదివారాలు, 12 రెండవ శనివారాలు కలిసి ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే విద్యార్థులకు దాదాపు 100 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. పాఠశాలలకు దసరా, సంక్రాంతి సెలవులు అదనంగా పెరిగే అవకాశం ఉండటంతో వచ్చే ఏడాది విద్యార్థులకు, ఉద్యోగులకు పండుగ వాతావరణం నెలకొననుంది.







