- కోకాపేటలో కోట్ల వర్షం!
- హెచ్ఎండీఏ వేలం..ఎకరం రూ.151.25 కోట్లు
- హైదరాబాద్ చరిత్రలోనే ఎకరా రికార్డు ధర
హైదరాబాద్, మహా: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో భూములు.. కో అంటే కోట్లు పలుకుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం రూ.151.25 కోట్ల రికార్డు ధర పలికింది. లక్ష్మీనారాయణ కంపెనీ ప్లాట్ నంబరు 15లో 4.03 ఎకరాలు.. ఎకరం రూ.151.25 కోట్లు చొప్పున, గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్లాట్ నంబరు 16లో 5.03 ఎకరాలు.. ఎకరం రూ.147.75కోట్ల చొప్పున దక్కించుకున్నాయి. నియోపోలిస్‌లోని ప్లాట్ నంబర్ 15, 16లోని 9.06 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయగా.. రూ.1,353 కోట్ల ఆదాయం లభించింది. ఈ లేఔట్ లో హెచ్ఎండీఏ ప్రారంభ ధర రూ.99కోట్లుగా నిర్ణయించింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వేలం ప్రక్రియ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది.
హైదరాబాద్ చరిత్రలోనే ఎకరా రికార్డు ధర పలికింది. ఎకరా ఏకంగా రూ.151.25 కోట్లకు వేలంలో అమ్ముడు పోవడంతో స్థిరాస్తి మార్కెట్‌కు ఊపునిచ్చే అంశమని చెబుతున్నారు.ఈనెల 24వ తేదీన నియోపోలిస్ లేఔట్లో జరిగిన వేలంలో 18వ ప్లాట్ లో ఎకరా భూమి రూ.137.25 కోట్లు పలికింది. నాలుగు రోజుల వ్యవధిలోనే మరోసారి నిర్వహించిన ఈ-వేలంలో అదే లేఔట్ లో ఎకరా ధర అధికంగా రూ.151.25 కోట్లు పలకడం గమనార్హం. నియోపోలిస్లోనే 19, 20 ప్లాట్లలో మరో 8 ఎకరాలకు పైగా భూములకు వేలం నిర్వహించేందుకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేసింది. డిసెంబరు 3వ తేదీన రెండు ప్లాట్లలో ఉన్న మరో 8 ఎకరాలు వేలం వేయనున్నారు. తర్వాత డిసెంబరు 5న కోకాపేట్ గోల్డెన్ మైల్లో ఉన్న మరో 1.98 ఎకరాలు వేలంలో విక్రయించనున్నారు.







