Mahaa Daily Exclusive

  ఎనిమిది కాదు.. ఆరు వరుసలే: త్రిబుల్ ఆర్ (RRR) పై కేంద్రం అనూహ్య నిర్ణయం

Share

  • ఎనిమిది కాదు.. ఆరు వరుసలే
  • త్రిబుల్ ఆర్ పై కేంద్రం అనూహ్య నిర్ణయం
  • భారీగా తగ్గిన వ్యయం

హైదరాబాద్, మహా : రీజినల్ రింగు రోడ్డు ( త్రిబుల్ ఆర్) విషయంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ తరహాలో దీన్ని కూడా 8 వరుసలతో నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం భారీగానే కసరత్తు చేసింది. కానీ కేంద్రం కేంద్రం దీనికి ఆమోదం తెలపలేదు. దాంతో ఆర్ఆర్ఆర్ నిర్మాణాన్ని ఇప్పుడు ఆరు వరుసలకే పరిమితం చేశారు. మరో 20 ఏళ్లకుపైనే అంటే 2047 వరకు పెరిగే ట్రాఫిక్ రద్దీకి ఈ ఆరు వరుసలు సరిపోతాయని కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆధ్వర్యంలోని పీఏటీఎస్సీ స్పష్టం చేసింది. ఆమేరకు అవసరం అయ్యే బడ్జెట్‌నే ఆమోదించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించి 6 వరుసల రోడ్డును మాత్రమే నిర్మించేందుకు వీలుగా అధికారులు డిజైన్లు సిద్ధం చేశారు. మరికొన్ని రోజుల్లో జరిగే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని.. పీపీపీఏసీ(పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ అప్రైజల్ కమిటీ) ఆ మేరకు బడ్జెట్‌ని ఆమోదించనుంది.

రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం 162.46 కి.మీ. పొడవైన రహదారి నిర్మాణం కోసం రూ. 18 వేల 600 కోట్లు ఖర్చవుతాయని ఎన్‌హెచ్ఏఐ అంచనా వేసింది. ఇప్పుడు 6 వరుసలకే కేంద్ర ఆమోదం తెలపడంతో.. ఈ నిర్మాణ వ్యయం మరింత తగ్గనుంది. ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణానికే రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని లెక్కలు వేసిన నేపథ్యంలో, 2 వరుసల రోడ్డును తగ్గిస్తే కిలోమీటరుకు రూ.15 కోట్లకు పైగా ఆదా అవుతుందని తేల్చింది. ఈ మేరకు అధికారులు చేసిన తాజా అంచనా ప్రకారం ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కోసం సివిల్ కాస్ట్ రూ.7,300 కోట్లు అవుతోంది. దీంతో రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణతో కలిపి మొత్తం 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం భారత్ మాల పరియోజనకు బదులు విజన్ 2047 ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2047 నాటికి చేపట్టాల్సిన ప్రాజెక్టులను ఇందులో చేర్చింది. 2047 నాటికి పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. వీటి నిర్మాణం చేపడుతోంది. ఆర్ఆర్ఆర్‌ను కూడా అందులో భాగంగానే చేపడుతున్నారు.

ఒకేసారి ఆరు వరుసల నిర్మాణం

వచ్చే ఏడాది మే నెలలో రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశముంది. అప్పుడు ఒకేసారి 6 వరుసల రోడ్డును పూర్తి చేస్తారు.అంటే మొత్తం రోడ్డు ఒకే దఫాలో సిద్ధం కానుంది. ఉత్తర భాగంలో 11 ఇంటర్ చేంజ్ స్ట్రక్చర్లుంటాయి. ఇతర రోడ్లను క్రాస్ చేసే చోట వీటిని నిర్మిస్తారు. అలానే మూడు నదుల మీద 3 భారీ వంతెనలు, 105 మీడియం బ్రిడ్జిలు, 85 కల్వర్టలుంటాయి. వీటన్నింటిని ఒకేసారి 6 వరుసల రోడ్డుకు సరిపడా నిర్మిస్తారు. 2047 నాటికి పెరిగే వాహనాల రద్దీ, ట్రాఫిక్‌ను ఆరు వరుసల రోడ్డు తట్టుకుంటుందని నిర్ధారించిన కేంద్ర ప్రభుత్వం అంతవరకే అనుమతి ఇచ్చింది. కానీ, భవిష్యత్తులో అనూహ్యంగా ట్రాఫిక్ పెరిగి ఆరు వరుసల రోడ్డు ఇరుకుగా మారితే అదనంగా రెండు వరుసలు నిర్మించి ఎనిమిది లేన్లకు పెంచుతారు. ఇందుకోసం సెంట్రల్ మీడియన్‌ను తగ్గించి ఆ స్థలాన్ని వినియోగిస్తారు. ప్రస్తుతం ఆరు వరుసలకే కుదించటం వల్ల మిగిలిన స్థలంలో స్ట్రీట్ లైట్లు, వర్షం నీటి కోసం డ్రెయిన్లు, మొక్కల పెంపకం కోసం వినియోగించనున్నారు.

Latest