Mahaa Daily Exclusive

  పవన్ వ్యాఖ్యలపై మంత్రుల కస్సుబుస్సు: తెలంగాణ అంశంపై తీవ్ర విమర్శలు

Share

  • పవన్ వ్యాఖ్యలపై కస్సుమన్న మంత్రులు
  • కోనసీమ కొబ్బరి పంటకు తెలంగాణ దిష్టి తగిలిందన్న పవన్
  • రాష్ట్రాల మధ్య వైషమ్యాలు సృష్టించే వ్యాఖ్యలని మండిపాటు
  • తెలంగాణలో పవన్ సినిమాను ఆడనివ్వమన్న మంత్రి కోమటిరెడ్డి
  • చంద్రబాబు స్పందించాలన్న మంత్రి పొన్నం

హైదరాబాద్‌, మహా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని, నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్‌ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. పవన్‌ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీరియస్‌ గా స్పందించారు. పవన్‌ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి. పవన్ క్షమాపణ చెప్పక పోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం. మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్లో కూడా పవన్‌ సినిమా విడుదల కాదు. పవన్‌ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. రాజకీయ అనుభవం లేకనే ఇలా మాట్లాడుతున్నాడు. పవన్ తెలిసి మాట్లాడాడో, తెలియక మాట్లాడాడో తెలియదు.. కానీ ఆయన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో నష్టపోయాం. తెలంగాణ వచ్చాక కేసీఆర్ వల్ల నష్టపోయాం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. చిరంజీవి సూపర్ మ్యాన్ ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. పవన్ కల్యాణ్‌ అన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్న సమయంలో హైదరాబాద్ ఆదాయం అంతా విశాఖ, కాకినాడ, తిరుపతికే వాడుకున్నారు. తెలంగాణ ప్రజలు దిష్టి కాదు.. ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్‌ నీళ్లు తాగారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి

తెలంగాణ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళఅయాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కలిసి ఉండాలని కోరుకుంటున్నామని, కానీ రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలుచేయడం ఏమిటని ప్రశ్నించారు. నిన్నటి వరకు తెలంగాణ మంచిదన్న అని చెప్పిన పవన్ ఆల్ ఆఫ్ డన్ గా ఎందుకు మాట మార్చాన్నది చంద్రబాబునాయుడు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కూడా స్పందించాలని, తమ వైఖరి ఏమిటన్నది స్పష్టం చేయాలని మంత్రి పొన్నం కోరారు. ప్రకృతి వైపరీత్యం వస్తే.. అది వదిలేసి మాపై నిందలా?. మా దగ్గర వర్షాలు పడుతున్నాయి.. మీ దిష్టే మాకు తాకిందని మేం అంటున్నామా?. వివేకంతో మాట్లాడాలి కానీ, సినిమా డైలాగులు పేల్చకూడదు అని అన్నారు.

తెలంగాణకు వస్తే పరిగెత్తించి కొడతారు

అంతకుముందు పవన్‌ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు కౌంటర్‌ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలని ఒక వీడియోలో బల్మూరి వెంకట్ కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతామని హెచ్చరించారు. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టం అని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్‌ క్షమాపణలు చెప్పకపోతే ఇక్కడి యువత పరిగెత్తించి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గట్టిగనే వార్నింగ్‌ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు తెలంగాణపై అక్కసు ఉంటే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలని కోరారు. తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు కూడా తెలంగాణలో ఆడవని హెచ్చరించారు. సినిమాల షూటింగ్‌లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించిపోవడానికి, వాళ్లు అభివృద్ధి చెందడానికి మాత్రమే తెలంగాణ అవసరం ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పడు బయటపడిందని పవన్‌ కల్యాణ్‌పై భగ్గుమన్నారు.

తల తిక్క మాటలు మానుకోవాలి

మంత్రి వాకిటి శ్రీహారి స్పందిస్తూ పవన్‌ తల తిక్క మాటలు మానుకోవాలని హితవు పలికారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదన్నారు. ఏపీలో మైలేజ్‌ కోసం తెలంగాణపై కామెంట్స్‌ చేయడమేంటి అని అన్నారు. అన్నదమ్ముల్లా విడిపోయాం.. సోదరుల్లా కలిసుందామన్నారు.

బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు

ఏపీ ఉప ముక్యమంత్రి పవన్ కళ్యాణ్ వకాశవాద రాజకీయాలకు తాజా వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. పవన్ కల్యాణ్‌ బాధ్యతారహితంగా మాట్లాడారని, అవకాశవాద వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టేలా పవన్ కామెంట్స్ చేశారంటూ పవన్ మెచ్యూరిటీ పెంచుకోవాలన్నారు. ఏరోటి కాడ ఆపాట పాడటం పవన్‌కు అలవాటు అయింది అని విమర్శలు చేశారు.

Latest