మెస్సీ మ్యాచ్ బందోబస్తు భేష్..
* హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్ విజయవంతం
* రాచకొండ పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి అభినందనలు.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం నిర్వహించిన ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రాచకొండ పోలీసులు అమలు చేసిన భద్రతా వ్యూహాలపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు లియోనల్ మెస్సీ పాల్గొన్న ఈ మ్యాచ్‌కు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చినప్పటికీ, పోలీసులు అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన డీజీపీ బి. శివధర్ రెడ్డి, రాచకొండ సీపీ సుధీర్ బాబుతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందించారు. చిన్నపాటి లోటుపాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారని ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ భద్రతాపరమైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో వివరించారు. ముఖ్యంగా శనివారం ఉదయం కోల్‌కతాలో జరిగిన ఘటన తమను అప్రమత్తం చేసిందని పేర్కొన్నారు. అక్కడ తలెత్తిన భద్రతా లోపాలను తక్షణమే విశ్లేషించుకుని, ఉప్పల్ స్టేడియంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని తెలిపారు. అభిమానులు ఎవరూ మైదానంలోకి చొచ్చుకు వెళ్లకుండా గ్రౌండ్ చుట్టూ ప్రత్యేక రోప్ పార్టీలను నియమించి పటిష్టమైన బందోబస్తు నిర్వహించినట్లు డీజీపీ వెల్లడించారు.
ఇంతటి భారీ ఈవెంట్ ప్రశాంతంగా జరగడానికి పోలీసుల కృషి ఎంత ఉందో, క్రీడాభిమానుల సహకారం కూడా అంతే ఉందని డీజీపీ పేర్కొన్నారు. మ్యాచ్ ఆద్యంతం క్రమశిక్షణతో మెలిగిన ఫుట్‌బాల్ క్రీడాభిమానులకు, ముఖ్యంగా మెస్సీ అభిమానులకు డీజీపీ శివధర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పోలీసుల అప్రమత్తత, అభిమానుల సహకారంతో ఈ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ విజయవంతంగా ముగిసింది.








