- కవిత కొత్త పార్టీ అంశంపై
- మండలి ఛైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు
- ‘చిరంజీవి, దేవేందర్ గౌడ్‌ల పార్టీలు ఏమయ్యాయో చూశాం కదా’ అని కామెంట్
హైదరాబాద్, మహా : తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చనున్న కవిత ప్రకటనపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ స్థాపించి నిలబెట్టుకోవడం కష్టమని, గతంలో చిరంజీవి, దేవెందర్ గౌడ్ వంటి వారి పార్టీలు స్థాపించి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారో చూశామని గుర్తుచేశారు. కవిత రాజీనామాను వ్యక్తిగత నిర్ణయంగా ఆమోదించినట్లు తెలిపారు. కవిత రాజీనామాకు గల కారణాలు చెప్పలేదు అని తెలిపారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తానంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉగాది నాటికి కొత్త పార్టీపై ప్రకటన చేస్తానని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత కొత్త పార్టీ అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించి… మనుగడ సాధించడం కష్టమన్నారు. ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలున్నాయని… పార్టీలు పెట్టి నిలబెట్టుకోవడం అంత సులభం కాదన్నారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ… ‘ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించి… దాన్ని నిలబెట్టుకోవడం సామాన్యమైన అంశం కాదు. గతంలో చిరంజీవి, దేవెందర్ గౌడ్ పార్టీలు పెడితే ఏమయ్యాయో చూశాం కదా’ అన్నారు. అలానే కవిత రాజీనామాపై స్పందిస్తూ… రాజీనామా ‘ఇన్‌పర్సన్’ (వ్యక్తిగతంగా) ఇస్తే ఆమోదం తెలుపుతామన్నారు. సభ్యులు కాకుండా ఇతరులు ఇస్తే ఆమోదం తెలపలేమన్నారు. కవిత ఇన్‌పర్సన్ ఇచ్చారు. అందుకే ఆమోదం తెలిపాను,” అన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ‘ముందుగా ఆమె తన పీఏ ద్వారా రాజీనామా పంపారు. దీని గురించి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇలా చేస్తే రాజీనామా ఆమోదించలేము అన్నారు. ఆ తర్వాత ఆమె నేరుగా కలిసి రాజీనామా ఆమోదించాలని కోరారు. అలానే తనకు ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. రాజీనామా చేసే వారి ఎవరికైనా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కవిత విషయంలో కూడా అదే చేశామన్నారు’ గుత్తా సుఖేందర్ రెడ్డి.
రాజీనామాకు గల కారణాలను కవిత చెప్పలేదన్నారు గుత్తా. ‘ఆమె రాజీనామాను నేను అడ్డుకోలేను… అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఇటీవలే సెషన్‌కి వచ్చినప్పుడు… ఒకసారి ఆలోచించుకోమని సూచించాను. కానీ కవిత అందుకు అంగీకరించలేదు, తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఆమె నిర్ణయం మేరకే కవిత రాజీనామాను ఆమోదించాను’అని తెలిపారు. మంగళవారం కవిత రాజీనామాను ఆమోదించారు.








