- ఏపీ లిక్కర్ కేసు
- విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు
- 22 న విచారణకు రావాలని ఆదేశం
అమరావతి, మహా : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను షేక్ చేసిన లిక్కర్ స్కామ్ మరో మలుపు తిరిగింది. విచారణకు రావాలని మాజీ వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 మధ్య అమలు చేసిన మద్యం విధానంలో అనేక అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి జరిగిన అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కుంభకోణంలో భారీగా నగదు దారి మళ్లినట్టు తేలడంతో ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలతో పలువురు రాజకీయ నాయకులను, అధికారులను, వ్యాపారులను కూడా ఈడీ విచారించింది. విదేశాలకు నగదు తరలించి బ్లాక్‌ను వైట్ చేసుకున్నారనే ఆరోపణలతోపాటు గత ఎన్నికల్లో ఆ డబ్బులు వాడుకున్నారనే అనుమానం ఉన్నందున మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఈడీ నిర్ణయించింది. అందులో భాగంగా నాటి ప్రభుత్వం, పార్టీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డిని ఈడీ విచారణకు పిలిచింది.
ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన ఆధారాలను ఇప్పటికే విశ్లేషించిన ఈడీ విచారణ మరింత వేగవంతం చేయాలని చూస్తోంది. అందుకే కీలకమైన విజయసాయిరెడ్డిని ప్రశ్నించనుంది. ఈడీ వద్ద ఉన్న వివరాలతో ఆయన్ని గ్రిల్ చేయనున్నారు. అసలు నగదు మార్పిడి ఎలా జరిగింది? ఎందుకు కేవలం నగదు రూపంలోనే షాపుల్లో వ్యాపారం చేశారనే వివరాలతోపాటు పాలసీ మేకింగ్, అమలులో ఎవరి పాత్ర ఏంటనే విషయాలపై వివరాలు సేకరించనున్నారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైసీపీలో తనకు అవమానాలు జరిగాయని ఆరోపించిన విజయసాయిరెడ్డి తన ప్రాథమిక సభ్యత్వానికి, వైసీపీ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాను వ్యవసాయం చేసుకుంటానని రాజీనామా సందర్భంగా ప్రకటించారు. అన్నట్టుగానే ఆయన రాజకీయాలపై స్పందించడం లేదు. అయినా గతంలో ఆయన ప్రభుత్వం, పార్టీలో కీలకంగా వ్యవహరించినందున నాటి కేసుల్లో ఆయనను దర్యాప్తు సంస్థలు పిలిచి ప్రశ్నిస్తున్నాయి. ఈ లిక్కర్ కేసులోనే పలు మార్లు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పిలిచి ప్రశ్నించింది. ఇప్పుడు ఈడీ వంతు వచ్చింది. గతంలో కూడా విజయసాయి రెడ్డి కాకినాడ పోర్టు వ్యవహారంలో, జగన్ కేసుల్లో ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరుకానున్నారు.








