Mahaa Daily Exclusive

  25 ఏళ్లుగా అడవే ప్రపంచం…

Share

  • 25 ఏళ్లుగా అడవే ప్రపంచం
  • అడవే ఆ కుటుంబానికి ఆత్మబంధువు
  • తెలుగురాష్ట్రాల సరిహద్దు అడవిలో మానవీయ గాథ

(మహా , భద్రాచలం)

పాతికేళ్ళుగా ఆ కుటుంబం అడవిలోనే ఉంది. జంతువులూ, పాములు వారిని ఏం చేయవు.. అవీ ఉంటాయి, మేమూ ఉంటాం అంతే అంటారు.. కొత్తకన్నాయిగూడెం, కావడిగుండ్ల పంచాయతీ, ఆదివాసీ కుటుంబాలు, గిరిజనుల దీన గాథ ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఎత్తైన కొండపైనున్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఒకే ఒక్క ఆదివాసీ కుటుంబం పాతికేళ్లుగా నివసిస్తోంది. ఈ కుటుంబ సభ్యుల సంఖ్య కేవలం మూడు.భార్య, భర్త, కుమారుడు అంతే.. కొండపైనున్న అడవి నుంచి మూడు కిలోమీటర్లు కిందకు నడిచివస్తే కానీ మనిషి జాడ కనిపించదు. నేటి జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన ఫోను, కరెంటు సౌకర్యాలు అక్కడ కనిపించవు. అయినాా వారు అలాగే జీవిస్తున్నారు. అసలు ఆ ముగ్గురు అక్కడే ఎందుకు ఉంటున్నారు. వారి రోజువారీ జీవితం ఎలా ఉంటుంది?
పాతికేళ్లుగా అడవిని వీడని వీరి గురించి అధికారులు ఏం చెబుతున్నారు? గుబ్బలమంగమ్మ గుడి నుంచి ఇంకాపైకి వెళ్తే…
ఇటు తెలంగాణ అశ్వరావుపేట మండలం.. అటు ఆంధ్రప్రదేశ్‌ బుట్టాయగూడెం మండలం సరిహద్దులో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల ఆరాధ్యదేవత గుబ్బల మంగమ్మ గుడి ఉంటుంది. ఆ గుడి ఆవల కొండలు, దట్టమైన అటవీ ప్రాంతమంతా తెలంగాణ పరిధి కంఠలం అటవీ పరిధిలోకి వస్తుంది. గుబ్బల మంగమ్మ గుడి వద్ద సాయంత్రం ఆరు తర్వాత జన సంచారమే కనిపించదు. గుడి పక్క నుంచి… దాదాపు మూడు కిలోమీటర్లు పైకి వెళ్తే.., కొండపై దట్టమైన అడవిలో 40 ఆదివాసీ కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా నివసిస్తుండేవి. ఈ గూడేన్ని గోగులపూడి అనేవారు. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితిలో ఆ కుటుంబాలను కిందకి దించేందుకు అధికారులు 1990నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదట్లో కొండ దిగేందుకు, అడవి నుంచి బయటకు వచ్చేందుకు వాళ్లు నిరాకరించినా.. అడవిలో విద్యుత్, మంచినీరు, పిల్లలకు విద్య వంటి ప్రాథమిక వసతులు కల్పించలేమని, పిల్లల కోసమైనా కిందకు దిగాలని ఐటీడీఏ అధికారులు పదే పదే చేసిన యత్నాలు దాదాపు పదేళ్లకి ఫలించాయి. ఆయా కుటుంబాలు 2000 సంవత్సరంలో ఆ కొండ దిగువున కొత్తకన్నాయి గూడెం ప్రాంతంలో కావడిగుండ్ల పంచాయతీ పరిధిలో నిర్మించిన పునరావాస కాలనీకి వచ్చాయి. కొండపైన అడవిలో వారు ఉన్న ప్రాంతం గోగులపూడి పేరునే కొండ దిగువన నిర్మించిన కాలనీకి పెట్టారు. అయితే ఆ 40కుటుంబాల్లో 39 కుటుంబాలు వచ్చాయి కానీ.. గురుగుంట్ల రెడ్డయ్య మాత్రం కిందకి రావడానికి నిరాకరించారు. అడవి నుంచి దిగేందుకు ససేమిరా అన్నారు. ఆయనతోపాటు భార్య లక్ష్మీ ,కుమారుడు గంగిరెడ్డి అక్కడే ఉండిపోయారు.

పాతికేళ్లుగా ఒంటరిగానే..
కాలం గడిస్తే రెడ్డయ్య మనసు మారుతుందని అధికారులు భావించారు. కిందకు దిగిన తమ బంధువులు, ఇరుగుపొరుగు వారు పొందుతున్న సౌకర్యాలు, అభివృద్ధి చూసి, లేదా తెలుసుకుని రెడ్డయ్య మారతారని అనుకున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా.. రెడ్డయ్యలో మార్పు రాలేదు. అడవి నుంచి కిందకు దిగేది లేదంటూ పాతికేళ్లుగా ఆ కుటుంబం అడవిలోనే ఉంటోంది. తన భర్త ఎక్కడుంటే తానూ అక్కడేనంటూ భార్య లక్ష్మి, అమ్మానాన్నలతోనే తానూ.. అని కుమారుడు గంగిరెడ్డి.. ముగ్గురూ.. అడవిలోనే ఉంటున్నారు. ఈ కుటుంబంతో మాట్లాడేందుకు ఓ మీడియా కొండపైకి నడుచుకుంటూ వెళ్లింది. ఆ కుటుంబంలోని రెడ్డయ్య భార్య లక్ష్మీ కుమారుడు గంగిరెడ్డితో మాట్లాడింది. ‘‘కనీసం కరెంటు కూడా లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు?’’ అని లక్ష్మీని అడిగితే “పగలు సూరీడు ఉంటాడు.. రాత్రిళ్లు చంద్రుడు, నక్షత్రాల వెలుగు వస్తుంది. చలికాలంలో, ఎప్పుడైనా చిక్కటి చీకటి ఉంటే చలిమంట వేస్తాం.ఇక్కడ ఎండు పుల్లలు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి” అని వివరించారు…ఏ పొద్దో తెలుసు కానీ.. పగలు, రాత్రి ఈ పొద్దులు తెలుసు కానీ.. ఏ రోజంటే ఏమో తెలియదు. ఎంత సమయమైంది. అంటే కూడా చెప్పలేమని లక్ష్మీ అన్నారు. ‘‘టైం తెలుస్తుందా’’ అంటే.. “టైం తెలియదు. ఏం తెలియదు. అలా నచ్చినట్టుండమే” అని ఆమె చెప్పారు. ‘‘రాత్రిళ్లు భయం వేయదా’’.. అని అడిగితే.. “భయం లేదు.. గియం లేదు.. మంట వేసుకుంటాం కదా.. తెల్లారిందాకా మంట ఉంటుంది.. ఏ జంతువులూ ఏమీ చేయవు.. అవి ఉంటాయి.. మేమూ ఉంటాం అంతే. పాములు ఏం చేయవు.. అవన్నీ మాకు అలవాటే” అని లక్ష్మీ, గంగిరెడ్డి చెప్పారు.”మేం తినేందుకే తిండిగింజలు పండించుకుంటాం.. మాకు సరిపోయేంతనే పండిస్తాం.. దగ్గరలోని ఏటి నీరే తెచ్చుకుంటాం.. అవి బాగుంటాయి.. ఎండాకాలం కూడా నీళ్లొస్తాయి.. వానాకాలమైతే పొంగుతాయి” అని లక్ష్మీ తెలిపారు.. జొరం,జబ్బు ఏమీ తెలియవు” మొత్తం తమకు తొమ్మిది మంది పిల్లలు పుట్టగా, ఏడుగురు చిన్నపిల్లలప్పుడే చనిపోయారని ఇద్దరు మాత్రమే ఉన్నారని లక్ష్మి తెలిపారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి అని తెలిపారు. అమ్మాయికి పెళ్లి చేసి కొండ కిందకు పంపేశామని అబ్బాయి గంగిరెడ్డి మాత్రం తమతోనే ఉన్నాడని చెప్పారు. వీరి కథనం మీడియాలో రాగా.. రెండు తెలుగురాష్ట్రాల్లో వీరి జీవనశైలి ఆశ్చర్యపరుస్తోంది.