Mahaa Daily Exclusive

  తెలంగాణలో సోలార్ విప్లవం: రూ.1380 కోట్లతో 81 సోలార్ గ్రామాల ఏర్పాటు!

Share

  • రూ.1380 కోట్లతో 81 సోలార్ గ్రామాల ఏర్పాటుకు చర్యలు
  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
  • సోలార్ రూఫ్ టాప్ ద్వారా గ్రామస్తులకు ఆదాయం

బోనకల్,మహా :

పైలెట్ ప్రాజెక్టు క్రింద రాష్ట్ర ప్రభుత్వం 1380 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా 81 సోలార్ గ్రామాల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం బోనకల్ మండలంలోని రావినూతల మోడల్ సోలార్ గ్రామాన్ని ఎన్.పి.డి.సి.ఎల్. సీఎండి వరుణ్ రెడ్డి, రెడ్కో సీఎండి ఏ. శరత్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలతో కలిసి ప్రారంభించి గ్రామస్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ* గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిపై ప్రభుత్వం పూర్తి ఖర్చు భరిస్తూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసి ఉత్పన్నమైన విద్యుత్తును సొంత అవసరాలకు వినియోగించుకుంటూ, మిగిలింది గ్రిడ్ కు విక్రయించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు క్రింద 1380 కోట్ల ఖర్చుతో 81 సోలార్ గ్రామాలను తీసుకోవడం జరిగిందని, ఖమ్మం జిల్లాలో 27 గ్రామాలు ఉండగా, అందులో బోనకల్ మండలంలో ఉన్న అన్ని 22 గ్రామాలను 306 కోట్లతో పైలెట్ ప్రాజెక్ట్ క్రింద ఎంపిక చేశామని అన్నారు. 24 కోట్ల రూపాయలతో రావినూతల గ్రామంలో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి సోలార్ రూఫ్ టాప్ సంవత్సరానికి 14 వేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, అవసరమైన విద్యుత్ మనం వినియోగించుకొని, మిగిలినది గ్రిడ్ కు అమ్ముకుంటే ప్రభుత్వం యూనిట్ కు 2 రూపాయల 57 పైసల చొప్పున చెల్లించడం జరుగుతుందని అన్నారు. గతంలో ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించేవారని, నేడు అదే విద్యుత్ శాఖ ప్రజలకు నగదు చెల్లించేలా పథకాన్ని రూపొందించామని అన్నారు. ఈ పథకాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని, అవసరం మేరకు మాత్రమే కరెంట్ వాడుకుంటూ మిగిలిన విద్యుత్తు అమ్మడం ద్వారా ఆదాయం పొందాలని డిప్యూటీ సీఎం సూచించారు. బోనకల్ మండలంలో ప్రతి రైతుకు వ్యవసాయ పంప్ సెట్ లు కూడా సోలార్ ద్వారా నడిచేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పంట ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా రైతులు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టామని అన్నారు. సోలార్ పంప్ సెట్ ను షెడ్ లా కూడా ఉపయోగ పడుతుందని అన్నారు. పంట పొలాల్లో మిగిలిపోయిన గడ్డిని కాల్చి వేయడం వల్ల పర్యావరణం కలుషితం అవుతుందని, రైతులు ఎవరు దయచేసి పొలాలకు నిప్పు పెట్టవద్దని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. పర్యావరణ కాలుష్యం వల్ల మన జీవనానికి ప్రమాదం ఏర్పడుతుందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, రాష్ట్ర హస్త కళల కార్పోరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఎస్ఇ ఇనుగుర్తి శ్రీనివాసా చారి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Latest