- గ్రామీణ, పట్టణ ప్రజల మధ్య అంతరం తగ్గాలంటే
- ఉన్నత విద్య, డిజిటల్ ప్లాట్ ఫారాలన్నీ సొంత భాషల్లో అందుబాటులోకి రావాల్సిందే
- భారతీయ భాషలు వారసత్వానికే కాదు దేశ భవిష్యత్తుకు పునాదులు
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
- మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ‘రాజభాష సమ్మేళనానికి’ హాజరైన కేంద్ర మంత్రి
- ఏ నాగరిక సమాజానికైనా భాష ఆత్మ లాంటిదని వెల్లడి
ఇండోర్, మహా : దేశంలో ఉన్నత విద్య, పరిశోధనలు, స్టార్టప్‌లతోపాటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లన్నీ మన సొంత భాషల్లో అందుబాటులోకి వచ్చినప్పుడే జ్ఞానానికి నిజమైన ప్రజాస్వామీకరణ సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సాంకేతికత, కృత్రిమ మేధస్సు, భాషా సాంకేతికత ఈ దిశలో కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని చెప్పారు. ఈ రంగాల్లో భారతీయ భాషలను కేంద్రంగా ఉంచితే గ్రామీణ, పట్టణ భారత్ మధ్య ఉన్న డిజిటల్ అంతరం దానికదే తగ్గుతుందన్నారు. హిందీతోపాటు భారతీయ భాషలు కేవలం గతానికి చెందిన మన వారసత్వం మాత్రమే కాదని, అవి దేశ భవిష్యత్తుకు పునాదులుగా నిలుస్తాయని తెలిపారు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ దేవి అహల్య విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన ‘‘మధ్య, పశ్చిమ మరియు దక్షిణ ప్రాంతాల ఉమ్మడి ప్రాంతీయ అధికారిక భాషా సమ్మేళనం’’ కార్యక్రమానికి సంజయ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రాజభాషలో విశిష్ట సేవలందించిన పలువురికి అవార్డులు అందజేశారు. వివిధ హిందీ సేవా సంస్థలు, బ్యాంకులు ఏర్పాటు చేసిన బుక్ స్టాల్స్ ను, హ్యాండిక్రాఫ్ట్ స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమ్మేళనానికి కేంద్ర మంత్రితోపాటు స్థానిక ఇండోర్ ఎంపీ శంకర్ లాల్వాణీ, దేవి అహిల్యా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా. రాకేశ్ సింఘై, హిందీ విద్యావేత్తలు జే ఎల్ రెడ్డి, నర్మదా ప్రసాద్, రాజభాషా విభాగం కార్యదర్శి శ్రీమతి అంజలి ఆర్య, సంయుక్త కార్యదర్శి డా. నిధి పాండే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, దేవి అహిల్యా విశ్వవిద్యాలయం వంటి జ్ఞానభూమిలో అధికారిక భాషా సమ్మేళనం జరగడం అదృష్టంగా భావిస్తున్నానని, దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర విభాగాలు, కార్యాలయాల్లో అధికారిక భాషా సంబంధిత నిబంధనల అమలును నిర్ధారించడంలో, పాలనలో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించడంలో రాజ్-భాషా విభాగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఏ నాగరిక సమాజానికైనా భాష ఆత్మ లాంటిదేనని, మోదీ నాయకత్వంలో భారత్ తన సాంస్కృతిక పునాదితో అనుసంధానమవుతూ ఆత్మనిర్భరత వైపు దృఢంగా ముందుకు సాగుతోందన్నారు. కొత్త జాతీయ విద్యా విధానంలో భారతీయ భాషలను విద్య, జ్ఞానానికి మౌలిక ఆధారంగా చేసుకొని ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో హిందీతోపాటు భారతీయ భాషలను పరిపాలనలో, సాంకేతికతలో ప్రపంచ స్థాయి సంభాషణలతో అనుసంధానించేందుకు కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. ఈ రోజు రాజభాషా విభాగం కేవలం నియమావళి అమలు చేసే విభాగంగా కాకుండా, నవ ఉత్తేజం, సాంకేతిక సాధికారతలో అగ్రభాగాన నిలిచే సంస్థగా మారిందన్నారు.








