Mahaa Daily Exclusive

  సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి ఆత్మహత్య మిస్టరీ: 100 సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన.. లభించని ఆధారాలు!

Share

  • 100 సీపీ కెమెరాల ఫుటేజీ వడపోత
  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బలవన్మరణంపై లభించని క్లూ
  • మిస్టరీగా మారిన సంఘటన

సికింద్రాబాద్‌, మహా : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పిన్నింటి విజయశాంతిరెడ్డి బలవన్మరణం ఘటన మిస్టరీ పోలీసులకు సవాల్ గా మారింది. నాలుగు రోజులుగా రైల్వే పోలీసుల ఉరుకులు పరుగులతో విచారిస్తున్నప్పటికీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విజయశాంతిరెడ్డి ఆత్మహత్య సంఘటనపై ఎలాంటి క్లూ దొరకడం లేదు. ఆమె ఎనిమిదేళ్లుగా నివసిస్తున్న కాలనీ, పనిచే స్తున్న కార్యాలయం, పిల్లలు చదువుతున్న విద్యా సంస్థల్లో సుమారు 200 మందిని కలిసి జీఆర్‌పీ పోలీసులు విచారించారు. తల్లీ పిల్లలను ఢీ కొట్టిన రైలు లోకోపైలట్‌ను కూడా విచారించారు. ఎక్కడా ఘటనకు సంబంధించిన వివరాలు లభించలేదు. ఘటనకు కొద్దిరోజుల ముందు నుంచి ఆమె కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన సమాచారం రాబట్టలేక పోయారు. ఘటన రోజు ఆమె ఇంటి దగ్గరి నుంచి ఇరువురు పిల్లల కళాశాలలు తిరిగి చర్లపల్లి రైల్వేస్టేషన్‌ చేరుకునే వరకు 100 సీసీ కెమెరా పుటేజీలను తెప్పించి పరిశీలించారు. వాటన్నింటిలోనూ తల్లి వెళ్లడం.. ఇరువురు పిల్లలను తోడుకుని రావడం మినహా మరెవ్వ రితోనూ కలిసిన దాఖలాలు కనిపించలేదు.

ఒక్కరోజే అంతా ఛేంజ్

గత నెల 27న కూతురు చైతన్యరెడ్డిని విజయశాంతిరెడ్డి పటాన్‌చెరు హాస్టల్‌ నుంచి ఔటింగ్‌ తీసుకొచ్చారు. ఐఐటీ ప్రవేశ పరీక్ష రాసిన అనంతరం 29న తిరిగి హాస్టల్‌లో డ్రాప్‌ చేసి వచ్చారు. 30న రాత్రి 8 గంటల ప్రాంతంలో కుమారుడిని వెంట తీసుకుని మళ్లీ ఔటింగ్‌ కావాలని చైతన్యరెడ్డి హాస్టల్‌కు వెళ్లారు. ఒక్క రోజులోనే మళ్లీ ఔటింగ్‌ ఎందుకని హాస్టల్‌ నిర్వాహకులు ప్రశ్నించగా.. బంధువు చనిపోయారని చెప్పారు. ఆ తరువాత ఇద్దరు పిల్లలతో కలిసి విజయ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులు ముందే బలవన్మరణం నిర్ణయం తీసుకుని ఉంటే కూతురిని ఐఐటీ పరీక్ష అనంతరం తిరిగి హాస్టల్‌లో డ్రాప్‌ చేసేవారు కాదని పోలీసులు భావిస్తున్నారు. ఒక్కరోజులోనే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం వెనుక కారణాలు ఏంటన్న విషయాలు విచారణలో తేలడం లేదు. కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాల కోణంలోనూ బలమైన అంశాలేవీ కానరావడం లేదు. ఆత్మహత్యల సమయంలో భర్త సురేందర్‌రెడ్డి దుబాయ్‌లో ఉన్నందున ఆయన పాత్ర ఉండక పోవచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ దశదిన కర్మ అనంతరం సురేందర్‌రెడ్డి ద్వారా కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఆమె మొబైల్, ల్యాప్‌టాప్‌కు సంబంధించిన ఫోరెన్సిక్‌ నివేదిక అందితే ఏదైనా క్లూ దొరుకుతుందని భావిస్తున్నారు.