Mahaa Daily Exclusive

  కేసీఆర్‌ను అరెస్ట్ చేసే దమ్ము లేకపోతే పదవికి రాజీనామా చెయ్: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్

Share

  • కేసీఆర్‌ను అరెస్ట్ చేసే దమ్ము లేకపోతే
  • పదవి నుంచి దిగిపో రేవంత్
  • సీఎం సవాల్ పై కిషన్ రెడ్డి స్పందన

హైదరాబాద్, మహా : మాజీ సీఎం కేసీఆర్ ను అరెస్టు చేసే విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ శుక్రవారం నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి తీవ్రంగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి కేసీఆర్‌ పై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా? అని ప్రశ్నించారు. చర్యలు తీసుకునే దమ్ము లేనప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను కాపాడేది నేను కాదు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే అని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌పై ఈగ వాలకుండా చూసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి మరీ దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ బుల్లెట్‌పై కేసీఆర్ కూర్చుంటే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూర్చుకున్నాడని ఆరోపించారు. అప్పుడు, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఎంఐఎం పార్టీనే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉంటే బహిరంగ ప్రకటన చేయాలని సవాల్ విసిరారు.

కాళేశ్వరం వితారణలో సగం సగం నివేదికలను ఇచ్చిన రాష్ట్రం కేంద్రంపై నిందలు వేస్తూ కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. బీజేపీ ఎవరికీ భయపడదని, తప్పు చేసిన వారెవరినీ వదిలి పెట్టిన దాఖలాలు లేవన్నారు. తన ఓటుకు నోటు కేసు విచారణ ముందుకు సాగకుండా అప్పట్లో కేసీఆర్ కాలయాపన చేస్తే ఇప్పుడు ఫఓన్ ట్యాపింగ్, కాళేశ్వరం తదితర కేసులలో విచారణను కావాలని రేవంత్ రెడ్డి సాగదీస్తున్నారని దుయ్యబట్టారు. తప్పంతా తనపైనే పెట్టుకుని ఎదుటివారిపై నిందలు వేయడం రేవంత్ రెడ్డికి వేన్నతో పెట్టిన విద్య అని అన్నారు.