Mahaa Daily Exclusive

  రేవంత్, కేసీఆర్‌లు రాహు కేతువులు: రాష్ట్ర ప్రజలకు బీజేపీ చీఫ్ రాంచందర్ రావు పిలుపు

Share

  • రేవంత్, కేసీఆర్ లు రాహు, కేతువులు
  • వారిద్దరి నుంచి రాష్ట్రాన్ని కాపాడండి
  • అమృత్ పథకంతో కొత్తగూడెం కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తాం
  • బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

కొత్తగూడెం, మహా : సీఎం రేవంత్ రెడ్డి రాహువు అయితే.. మాజీ సీఎం కేసీఆర్ కేతువు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అభివర్ణించారు. ఈ రాహు కేతువుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొత్తగూడెంలో బీజేపీ విజయ సంకల్ప సభ పేరిట నిర్వహించిన భారీ సభలో రాంచందర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఒక్కటి మినహా హామీల అమలులో విఫలమైందంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్ర పథకంతో ఇంటింటికీ తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ వస్తుందన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో పన్నుల వసూళ్లు మినహా పనులు లేవని రాంచందర్ రావు వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనటం వెనుక ఉన్న ఆంతర్యాన్ని గమనించాలంటూ ప్రజలకు సూచించారు. కేంద్రంలోని ఎన్డీయే కూటమి తీసుకువచ్చిన అమృత్ పథకంతో కొత్తగూడెం కార్పొరేషన్ ఆధునీకరణ పనులు చేపడతామన్నారు. కాంగ్రెస్ పార్టీలోని వర్గ పోరుతో కుంభకోణాలు బట్టబయలు అవుతున్నాయని పేర్కొన్నారు. సింగరేణిలో నైనీ టెండర్ల రద్దు వెనుక కుంభకోణం ఉందని ఆరోపించారు.

సింగరేణిలో అప్పుల కారణంగా జీతాలు ఇవ్వలేని స్థాయికి దిగజార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సూచనల మేరకు సింగరేణిపై ఇటీవల కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సమీక్షించారన్నారు. సింగరేణి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర కేబినెట్‌లోని బీసీల లెక్క తేల్చాలంటూ రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన సభలో సభ్యత్వం లేకుండా ఒక ముస్లింకి మంత్రి పదవి కేటాయించారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలవి ఒకే విధానాలని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కుంభకోణాల ఫైల్స్ కాలిపోయాయని, దీంతో వాస్తవాలు బట్టబయలు కాకుండా కుట్ర జరిగిందంటూ టీ బీజేపీ చీఫ్ నిప్పులు చెరిగారు. పోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఎఫ్‌‌ఎస్‌ఎల్ ఫైల్స్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తగులబడటం వెనుక ఆంతర్యాన్ని గమనించాలన్నారు. ఓటుకు నోటు కేసును 10 ఏళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. అవినీతి విచారణల్లో అధికారులను అరెస్ట్ చేశారని.. మరి నాయకులపై చర్యలు ఏవంటూ ఆయా పార్టీల నేతలను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిద్దాం, తెలంగాణను కాపాడు కుందామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

Latest