ముంబై, మహా
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (85) అస్వస్థతకు గురయ్యారు. గత కొద్దిరోజులుగా గొంతు నొప్పితో పాటు తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న ఆయనను, సోమవారం మధ్యాహ్నం బారామతిలోని తన నివాసం నుండి పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌కు తరలించారు. గత రాత్రి నుండి పవార్ గొంతు ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారు. దగ్గు తగ్గకపోవడం, ఛాతీలో కాస్త పట్టేసినట్లు అనిపించడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ఆయనను అంబులెన్స్‌లో పుణెకు తీసుకువచ్చారు. రూబీ హాల్ క్లినిక్ మేనేజింగ్ ట్రస్టీ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పర్వేజ్ గ్రాంట్ ఈ విషయాన్ని వెల్లడించారు. “పవార్ గారికి గొంతు సమస్య, దగ్గు ఉన్నాయి. ప్రస్తుతం మా వైద్యుల బృందం ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేస్తోంది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, ఆయనను ఆసుపత్రిలో ఉంచాలా లేక మందులు ఇచ్చి ఇంటికి పంపాలా అనేది నిర్ణయిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.
అజిత్ మరణంతో ఒత్తిడి
శరద్ పవార్ గతంలో క్యాన్సర్‌ను జయించిన వారు కావడంతో, గొంతుకు సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. దానికి తోడు, ఇటీవల తన అన్న కొడుకు అజిత్ పవార్ ఆకస్మిక మరణం ఆయనను మానసిక ఒత్తిడికి గురిచేసిందని, ఆ ప్రభావం కూడా ఆరోగ్యంపై పడి ఉండవచ్చని కార్యకర్తలు భావిస్తున్నారు.







