- హైదరాబాద్‌లో రూ.5 వేల కోట్ల భారీ గేమింగ్ స్కామ్
- ఓటీపీలు లేకుండానే మోసాలు
- హైదరాబాద్ లో తీగ లాగితే దుబాయ్ కదిలిన డొంక
హైదరాబాద్, మహా : హైదరాబాద్ లో మరో భారీ స్కామ్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు బయటపెట్టారు. ఫిన్‌టెక్ ముసుగులో భారీగా ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ కు పాల్పడినట్లు గుర్తించారు. ఏకంగా రూ.5 వేల కోట్ల భారీ అక్రమ దందా గుట్టును రట్టు చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో షెల్ కంపెనీలను స్థాపించి వేల కోట్ల రూపాయలను అందులోకి మళ్లిస్తున్నట్లు డీజీజీఐ అధికారులు గుర్తించారు. ఏకంగా రూ.5 వేల కోట్లను పన్నులు ఎగ్గొట్టి దుబాయ్‌కు మళ్లించినట్లు పేర్కొన్నారు. దుబాయ్ కేంద్రంగా ఈ ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన నిందితులు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించి ఏకంగా బ్యాంకులకే టోకరా వేశారని ఈ కేసు విచారణలో అధికారులు గుర్తించారు. ఓటీపీలు లేకుండానే రూ.5 వేల కోట్ల నిధులను షెల్ కంపెనీలకు తరలించినట్లు పేర్కొన్నారు. దుబాయ్ కేంద్రంగా ఈ ముఠాకు చెందిన మాస్టర్ మైండ్ పనిచేస్తోందని వెల్లడించారు. హైదరాబాద్‌లో తీగ లాగితే దుబాయ్‌లో డొంక కదిలిందని తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా రియల్ మనీ గేమింగ్ నిర్వహించి ఈ కోట్ల రూపాయల సొమ్మును కూడబెట్టినట్లు డీజీజీఐ అధికారులు వెల్లడించారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) కట్టకుంటే ఎగ్గొట్టేందుకు ఎస్క్రో అకౌంట్లను నిందితులు ఉపయోగించినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఓషియానిక్ వెబ్ సొల్యూషన్స్, వెబ్‌విన్ సొల్యూషన్స్ అనే రెండు నకిలీ కంపెనీల ద్వారా ఈ నిధులను మొత్తాన్ని మళ్లించారని పేర్కొన్నారు. funinmatch360, raceje-et247 వెబ్‌సైట్ల ద్వారా ఈ రియల్ మనీ గేమింగ్ అక్రమ దందా సాగినట్లు స్పష్టం చేశారు. బ్యాంకింగ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (బ్యాంకు ఏపీఐ)లను దుర్వినియోగం చేసి కనీసం బ్యాంకు ఆడిట్‌లకు కూడా దొరకకుండా నిందితులు జాగ్రత్త పడినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. విగోఫిన్ సంస్థ డైరెక్టర్లు ప్రభు కుమార్, రాజశేఖర్ రెడ్డిలపై నిఘా పెట్టిన అధికారులు ఈ భారీ కుంభకోణాన్ని బయటికి తెచ్చారు. ఈ భారీ కుంభకోణంలో ఈ ఇద్దరు వ్యక్తుల పాత్రపైనా అధికారుల ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి.. ఈ మొత్తం దందాను, నెట్‌వర్క్‌ను దుబాయ్ నుంచి నడిపిస్తున్నట్లు గుర్తించారు.








