Mahaa Daily Exclusive

  ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియకు అడ్డంకులు సహించం: సుప్రీంకోర్టు హెచ్చరిక

Share

  • ఎస్ఐఆర్ ప్రక్రియకు అడ్డంకులు రానివ్వం
  • అవసరమైతే ఆదేశాలు జారీ చేస్తాం
  • మాస్ ఎక్స్‌క్లూజన్ జరగకూడదన్న పశ్చిమ బెంగాల్ వాదనపై సుప్రీంకోర్టు స్పందన

న్యూఢిల్లీ, మహా : ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ఎవరూ అడ్డుకోవడానికి అనుమతించబోమని, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు సహించబోమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఆ విషయంలో అవసరమైతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. పశ్చిమ బెంగాల్​లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై నెలకొన్న వివాదాల వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ ఎన్​వీ అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

పశ్చిమ బెంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కారణంగా పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని, అర్హులైన ఓటర్లు తమ హక్కు కోల్పోయే అవకాశముందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారీగా ఓట్ల తొలగింపు జరగొచ్చన్న అభిప్రాయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన సీజేఐ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకి రానివ్వమని, ఇది రాష్ట్రాలన్నీ గమనించాలని స్పష్టం చేశారు.

డీజీపీకి కోర్టు ఆదేశాలు

విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం (ఈసీ) సమర్పించిన అఫిడవిట్‌ను కోర్టు పరిశీలించింది. ఎన్నికల అధికారులు జారీ చేసిన నోటీసులను కొందరు దుండగులు కాల్చివేశారని ఈసీ ఆరోపించింది. ఇప్పటివరకు ఆ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని కూడా తెలిపింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ విషయంపై వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పశ్చిమ బెంగాల్​ డీజీపీకి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అధికారుల చేతుల్లోనే

కేంద్ర ప్రభుత్వ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, “భారత రాజ్యాంగం దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా వర్తిస్తుంది. ఎన్నికల ప్రక్రియను ఎవరూ దెబ్బతీయకూడదు” అని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సహకారం అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో సహాయంగా ఉపయోగించేందుకు పశ్చిమ బెంగాల్​ ప్రభుత్వం 8,505 గ్రూప్-బి అధికారుల జాబితాను ఎన్నికల సంఘానికి అందజేసింది. వీరికి శిక్షణ ఇచ్చి అవసరమైన చోట వినియోగించవచ్చని కోర్టు సూచించింది. అయితే తుది నిర్ణయాలు మాత్రం ఎన్నికల రోల్ అధికారుల చేతుల్లోనే ఉంటాయని బెంచ్ స్పష్టం చేసింది. ఈ అధికారుల పనితీరు, బాధ్యతలు ఎలా ఉండాలన్నది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని తెలిపింది.

మమతా బెనర్జీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, మైక్రో ఆబ్జర్వర్ల నియామకం, పెద్దఎత్తున ఓటర్ల తొలగింపు వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. “మాకు మాస్ ఎక్స్‌క్లూజన్ అస్సలు వద్దు. అర్హులైన ఓటరు ఒక్కరూ కూడా నష్టపోవద్దు” అని ఆయన కోర్టును కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగాలని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, దానిని కాపాడటం అందరి బాధ్యత అని వ్యాఖ్యానించింది. ఒకవేళ ఎక్కడైనా అవకతవకలు జరిగితే తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మొత్తంగా చూస్తే, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నది సుప్రీంకోర్టు స్పష్టమైన సందేశంగా మారింది. ఎన్నికల పనుల్లో ఆటంకాలు సృష్టించే వారికి కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇకపై ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Latest