హైదరాబాద్, మహా : రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం ఎన్నికల అధికారి నుండి ధ్రువీకరణ పత్రాలను వీరిద్దరూ స్వీకరించారు. అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా వారు ఈ సర్టిఫికేట్లను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులకు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
దేశవ్యాప్తంగా జరిగిన రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెలంగాణలో ఖాళీ అయిన స్థానాలకు వీరిద్దరిని కాంగ్రెస్ అధిష్ఠానం బరిలోకి దింపింది. బీఆర్ఎస్, బీజేపీలకు తగినంత సఖ్యాబలం లేకపోవడంతో బరిలో ఆ పార్టీల నుంచి అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో కాంగ్రెస్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. రాజ్యసభలో తెలంగాణ గొంతుకను బలంగా వినిపిస్తామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.







