Mahaa Daily Exclusive

  మళ్లీ లాక్‌డౌన్ భయం….

Share

  • మళ్లీ లాక్‌డౌన్ భయం
  • గ్యాస్ కరవుతో వీధిన పడ్డ లక్షలాది మంది.. నిలిచిన ఉపాధి
  • గ్యాస్ సంక్షోభంతో లాక్‌డౌన్‌ను తలపిస్తున్న ప్రస్తుత పరిస్థితులు
  • రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడటంతో రోడ్డున పడిన లక్షలాది మంది కార్మికులు
  • పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో స్తంభించిన రవాణా వ్యవస్థ
  • సిలిండర్ కోసం వేలల్లో చెల్లింపు.. అయినా సామాన్యుడికి అందని ద్రాక్షే
  • ఆదాయం లేక, ఆకలితో అలమటిస్తున్న రోజువారీ కూలీలు

మహా : ఢిల్లీ, నోయిడా వంటి నగరాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఒక్క హోటల్ రంగంలోనే వేల సంఖ్యలో రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇందులో పనిచేసే వెయిటర్లు, క్లీనర్లు, వంట మనుషులు మళ్లీ తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. “కరోనా సమయంలో ఎలాగైతే పనిలేక ఇంటికి వెళ్ళామో.. ఇప్పుడు గ్యాస్ లేక మళ్లీ అదే పరిస్థితి వస్తోంది” అని నోయిడాలోని ఒక రెస్టారెంట్ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

బ్లాక్ మార్కెట్ విలయతాండవం

కొరతను ఆసరాగా చేసుకుని అక్రమ వ్యాపారులు కోట్లు గడిస్తున్నారు. సాధారణంగా దొరకాల్సిన వాణిజ్య సిలిండర్లు ఇప్పుడు కేవలం బ్లాక్ మార్కెట్లోనే దర్శనమిస్తున్నాయి. ధర రూ. 5,000 దాటినప్పటికీ గ్యాస్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. మరోవైపు, డొమెస్టిక్ గ్యాస్‌ను అక్రమంగా హోటళ్లకు మళ్లిస్తుండటంతో సామాన్యులకు కూడా వంట గ్యాస్ అందడం లేదు.

ప్రభుత్వ జోక్యం కోసం ఎదురుచూపులు

ఉపాధి కోల్పోయిన లక్షలాది కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంధన సరఫరాను పునరుద్ధరించకపోతే, ఈ సంక్షోభం మరిన్ని ప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్ లో గ్యాస్ సంక్షోభంపై కేంద్రం దృష్టి పెట్టినప్పటికీ అనుకున్నంత ఫలితాలు కనిపించక పోవడం ఆందోళనకరమైందని అంటున్నారు. గ్యాస్ వినియోగం, సరఫరా, ఉత్పత్తి తదితర అంశాలపై కేంద్రం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తే తప్పా ప్రస్తుత పరిస్థితి చక్కబడే అవకాశం లేదని పేర్కొంటున్నారు.