Mahaa Daily Exclusive

  ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు…..

Share

  • ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు
  • కవిత నివాసానికి సీబీఐ అధికారులు
  • నోటీసులు అందుకున్న భర్త అనిల్
  • ఈ నెల 16 న కోర్టు విచారణ ఉందని తెలిపిన అధికారులు

హైదరాబాద్, మహా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాజా పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచాయి. మాజీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత నివాసం వద్ద గురువారం హైడ్రామా చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఆమెకు నోటీసులు అందజేశారు. బంజారాహిల్స్‌లో ఉన్న కల్వకుంట్ల కవిత నివాసానికి మధ్యాహ్నం సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన హైకోర్టులో దాఖలైన తాజా కౌంటర్‌ అఫిడవిట్‌పై వివరణ కోరుతూ కోర్టు జారీ చేసిన నోటీసులు అందజేయడమే అధికారుల ప్రధాన ఉద్దేశం. అయితే అధికారులు వెళ్లిన సమయంలో కవిత తన నివాసంలో అందుబాటులో లేరు. దీంతో సీబీఐ అధికారులు ఆ నోటీసులను కవిత భర్త అనిల్ కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు అనిల్‌ కుమార్‌తో మాట్లాడినట్టు తెలుస్తోంది. కవిత ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు వస్తారని అడిగారు. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉన్నందున, మార్చి 16వ తేదీన జరిగే తదుపరి విచారణ అత్యంత కీలకం కానుంది. క్లీన్‌చిట్ నిలబడుతుందా లేదా మళ్లీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందా అనేది వేచి చూడాలి.

క్లీన్ చిట్ నుంచి హైకోర్టు వాల్ వరకు ఏం జరిగింది?

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు సంబంధించి గతంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ తీర్పు అరవింద్ కేజ్రీవాల్, కవితతోపాటు చాలా మంది నేతలకు ఊరట ఇచ్చింది. అయితే దర్యాప్తు సంస్థ ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టులో తాము సమర్పించిన ఆధారాలను ,కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని సీబీఐ తన అప్పీల్‌లో పేర్కొది. ఈ క్రమంలోనే దర్యాప్తును మరింత వేగవంతం చేసిన అధికారులు, హైకోర్టు ఆదేశాల మేరకు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను కవితకు సీబీఐ అధికారులు ఇచ్చారు.