Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్ కు సుప్రీంకోర్టు షాక్…..

Share

  • ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు
  • బీఆర్ఎస్ కు సుప్రీంకోర్టు షాక్
  • స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం
  • కేసును మూసి వేస్తున్నట్లు ప్రకటన

న్యూఢిల్లీ, మహా : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై సుప్రీం కోర్టు విచారణను ముగించింది. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ డిస్పోజ్ చేసింది. ఈ కేసు విచారణ సమయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి.. దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే విచారణ చేసి.. తగిన నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. పిటిషన్లను స్పీకర్ కార్యాలయం పరిష్కరించిందని ధర్మాసనానికి వెల్లడించారు. అభిషేక్ మను సింఘ్వీ వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. స్పీకర్ ఇప్పటికే ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకున్నందున ఇక మీద ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని ముగించింది. అంతేకాదు రెండు రోజుల్లో తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు అసెంబ్లీ స్పీకర్ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీలు మారినట్టుగా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. వీరిద్దరిపై అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని తీర్పులో స్పీకర్ వెల్లడించారు. సుప్రీంకోర్టులో విచారణకు ముందే స్పీకర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో తెల్లం వెంకట్‌రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్‌, అరికెపూడి గాంధీ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్‌, దానం నాగేందర్‌, కడియం శ్రీహరి ఉన్నారు. తాజాగా సుప్రీం కోర్టు కూడా స్పీకర్ నిర్ణయం సరైందేనని పేర్కొంటూ కేసును మూసి వేస్తున్నట్లు ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్టైంది.