Mahaa Daily Exclusive

  భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య…

Share

  • భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య
  • ఎక్సైజ్ సీఐ సహా 11 మందిపై కేసు నమోదు
  • నేరెడ్ మెట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఘటన

హైదరాబాద్, మహా : కట్టుకున్న భార్య వేధింపులు భరించలేక, మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్ లో చోటు చేసుకుంది. తన చావుకు భార్య వేధింపులే కారణమని బాధితుడు రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన నగెల్లి శ్రీనివాస్ (41) నగరంలోని నేరేడ్మెట్ లక్ష్మీనగర్‌లో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 2012లో సట్లపల్లి జ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వివాహ సమయంలో జ్యోతి సాధారణ గృహిణి కాగా, భర్త శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఆమె పోటీ పరీక్షలకు సిద్ధమై ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం ఆమె ఎక్సైజ్ సీఐ హోదాలో పనిచేస్తున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత జ్యోతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్తను దూరం పెడుతూ శ్రీనివాస్, అతడి కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, విడాకుల కేసులను బనాయించింది. దీంతో గత నాలుగు నెలలుగా శ్రీనివాస్ తన భార్యకు దూరంగా ఉంటూ మానసిక వేదనను అనుభవిస్తున్నాడు. కోర్టు కేసులు, భార్య వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన, మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.

సూసైడ్ నోట్ లభ్యం

శ్రీనివాస్ సోదరుడు శివకృష్ణ ఇంటికి వచ్చి చూడగా.. శ్రీనివాస్ విగతజీవిగా కనిపించాడు. ఘటనా స్థలంలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో ‘నా భార్య పెట్టిన వేధింపులు, తప్పుడు కేసుల వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని శ్రీనివాస్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. మృతుడి సోదరుడు శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరేడ్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ సీఐ జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 10 మంది వ్యక్తులపై కేసులు బుక్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.