- బుక్ చేసిన 60 గంటల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ
- కేంద్రం కీలక ప్రకటన
- హడావిడి బుకింగ్ చేసుకోవద్దని సూచన
- ఎల్ పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచినట్లు వెల్లడి
న్యూఢిల్లీ, మహా : వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. సిలిండర్‌ను బుక్ చేసిన రెండ్రోజుల్లోనే డెలివరీ అవుతుందని తెలిపింది. ప్రభుత్వ చర్యలతో ఎల్ పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచినట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
భయాందోళనలకు గురి కావొద్దన్న కేంద్రం
గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అవుతుందని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ చర్యలతో ఎల్ పీజీ ఉత్పత్తిని 25 శాతానికి పెంచామని ప్రకటించింది. హార్ముజ్ జలసంధితో సంబంధం లేని రూట్ల ద్వారా చమురు దిగుమతి అవుతోందని వివరించింది. హార్ముజ్ నుంచి ఆగిపోయిన సప్లై కంటే ఎక్కువ చమురునే సేకరించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ప్రజలెవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియంశాఖ పేర్కొంది. రెండున్నర రోజుల సాధారణ డెలివరీ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. భారత్ కు ముడి చమురు సరఫరాలు సురక్షితంగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ విలేకరులతో అన్నారు.ముడి చమురును హార్ముజ్ జలసంధి కాని మార్గాల నుంచి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. “కస్టమర్లు సిలిండర్లను హడావిడిగా బుక్ చేయాల్సిన అవసరం లేదు. భయాందోళనలకు గురి కావొద్దు. సాధారణంగానే బుకింగ్స్ అవుతాయి” అని సుజాతా శర్మ ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ల మార్కెట్ విషయంలో బ్లాక్ మార్కెటింగ్ కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
“దాదాపు 40 దేశాల నుంచి భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు వివిధ వనరుల నుండి వివిధ ముడి సరుకులను సేకరించాయి. భారతదేశం యొక్క ముడి దిగుమతులలో 70 శాతం ఇప్పుడు హోర్ముజ్ జలసంధి వెలుపల మార్గాల నుండి వస్తున్నాయి” అని సుజాతా శర్మ వివరించారు.







