- ఉమ్మడి ఏపీ పోలీసు బ్రాండ్ క్రియేటర్
- మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత
- సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్, మహా : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీసు శాఖకు బ్రాండ్ క్రియేటర్ గా మారిన మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రోజు తుది శ్వాస విడిచారు. 1943లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన హద్దన హేళి జగన్నాథ దొర (హెచ్‌జే దొర) ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1965లో ఐపీఎస్ గా చేరారు. 40 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఐపీఎస్ ట్రైనింగ్ తర్వాత హైదరాబాద్‌లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా హెచ్‌జే దొర ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీగానూ వ్యవహరించారు. సీబీఐలో ఎస్పీ, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, సీఐడీ హెడ్‌గా హెచ్‌జే దొర సేవలు అందించారు.
1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన దొర..2002 ఫిబ్రవరి వరకు ఐదేళ్ల పాటు ఉమ్మడి ఏపీ డీజీపీగా వ్యవహరించారు. సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లో విజిలెన్స్ కమిషనర్‌గానూ ఆయన సేవలందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో హెచ్‌జే దొర చేసిన సేవలకు పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అవార్డు ఆయనను వరించింది. ఆయన డీజీపీగా పని చేసిన కాలంలో పోలీసు శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చి దేశంలోనే ఏపీ పోలీసుకు గుర్తింపును తీసుకు వచ్చారు.
దొర మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి
మరోవైపు మాజీ డీజీపీ హెచ్‌జే దొర మరణంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెచ్‌జే దొర మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందన్న చంద్రబాబు.. ఏపీ పోలీస్‌కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో దొర కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఎన్టీఆర్ దగ్గర ఇంటెలిజెన్స్ అధికారిగా, తన హయాంలో డీజీపీగా దొర చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయంటూ ట్వీట్ చేశారు. అప్పట్లో రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నక్సల్ సమస్య పరిష్కారంలో హెచ్‌జే దొర ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారని చంద్రబాబు నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. హెచ్.జె దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.








