- వంట గ్యాస్ కొరత లేదు
- బుకింగ్ లు నిలిచిపోయిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవం
- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. గ్యాస్ కొరత అంటూ వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దంటూ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఇక వంట గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై నిఘా పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో సివిల్ సప్లై కమిషనర్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గృహ వినియోగానికి అవసరమైన గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నిలిచిపోయిందంటూ వస్తున్న వార్తలను నమ్మి గ్యాస్ సరఫరాపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి వంట గ్యాస్ వినియోగదారుడికి అవసరమైన గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు పంపించి పక్కదారి తరలిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. అక్రమంగా గ్యాస్ అమ్మకాలు జరగకుండా ఎప్పటికప్పుడు నిఘాను ముమ్మరం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్టల్స్‌కు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. గ్యాస్ వినియోగదారులకు ఏదైనా అసౌకర్యం కలిగిస్తే.. ఎవరినీ వదిలిపెట్టేది లేదని మంత్రి తెలిపారు. రూల్స్ అతిక్రమిస్తే గ్యాస్ ఏజెన్సీలపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు వెల్లడించారు. నిత్యవసరాల సరఫరాలో పారదర్శకత ఉండాలని.. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.







