Mahaa Daily Exclusive

  రూ.16వేల కోట్లతో మూసీ పునరుజ్జీవం సాధ్యం.. లక్షన్నర కోట్ల ‘విధ్వంసం’ ఎందుకు?: పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేటీఆర్ సూటి ప్రశ్న!

Share

  • ఒక్క ఇల్లూ కూల్చకుండా..
    రూ.16వేల కోట్లతో మూసీ ప్రాజెక్టు
  • ఒక విడతను మేం విజయవంతంగా చేసి చూపాం
  • రూ.లక్షన్నర కోట్ల అంచనాతో ఇపుడు విధ్వంసం
  • మూసీ చుట్టూ ఉన్న భూముల కోసమే ప్రాజెక్టు
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజంటేషన్

హైదరాబాద్, మహా : బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.16,000 కోట్లతో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో 6 కి.మీ మేర విజయవంతంగా అభివృద్ధి చేశామని.. అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హిమాయత్ సాగర్ వేదికగా శనివారం “మూసీ పునరుజ్జీవం – పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలాంటి డీటెయిల్స్ ప్లానింగ్ రిపోర్టు లేకుండా.. సోషల్ ఇంఫాక్ట్ స్టడీ.. ఎన్విరాన్ మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు, ప్రజలతో ఎలాంటి చర్చలు లేకుండా వేలమంది ఇండ్లను కూలగొడతామని కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చట్టాలను ఇతర నిబంధనలను అన్నింటినీ పాతర వేసి వేలకోట్ల అవినీతికి తెగబడుతున్నదని విమర్శించారు. అభివృద్ధికి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని…అవినీతికి కాంగ్రెస్ పార్టీ భూదాహానికి రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకమని కేటీఆర్ అన్నారు.

బాధితుల పక్షాన బీఆర్ఎస్

గత ప్రభుత్వంలో కేసీఆర్ పిపిటి ప్రజెంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పిపిటి ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి అనే విద్వంసం గురించి పిపిటి ఇచ్చాడని కేటీఆర్ అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టార్ హోటల్లో రేవంత్ రెడ్డి పిపిటి ఇస్తే, మూసిని ఎలా అభివృద్ధి చేయవచ్చో బాధితులతో కలిసి బాధితుల పక్షాన ఈరోజు మేము వివరిస్తున్నామన్నారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా గత ప్రభుత్వం ఆరు కిలోమీటర్ల మూసిని విజయవంతంగా అభివృద్ధి చేసిందన్నారు. నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీనేనని దుయ్యబట్టారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసి సర్వనాశనం అయిందన్నారు. గతంలో మూసిని మురికి కుప్పగా మార్చిన పాపానికి ప్రజలకు క్షమాపణ చెప్పి పాపాన్ని కడుక్కోవాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

మూసీ పక్కన ఉన్న భూముల కోసమే ప్లాన్

వందల కిలోమీటర్ల నమామి గంగే కి ఖర్చు కేవలం రూ.42 వేల కోట్లు అయితే, 55 కిలోమీటర్ల మూసీకి లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందనే తమ ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోమన్నారు. కానీ కేవలం మూసీ పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకుంటామంటే ఖచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే మూసీ కోసం కాకుండా, మూసీ పక్కన ఉన్న భూముల కోసం పనిచేస్తున్నాడని… రేవంత్ రెడ్డి స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేమిటి అని అంటున్నారని… గాంధీ విగ్రహం పెడతా అంటున్న రేవంత్ రెడ్డి, గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ ఆయన పేరుతో మూసీలో దోపిడీ చేయవద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కేవలం ఎవరు అడ్డుకోవద్దని మహాత్మా గాంధీ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి పెట్టే కుట్ర చేస్తున్నాడన్నారు. మూసీ అంశంలో తమ పార్టీది మానవీయ కోణంలో అభివృద్ధి చేసే కార్యక్రమంగా కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల ఇండ్లను కూల్చి వాటి పునాదుల పైన మూసి ప్రాజెక్టు కట్టడం అన్యాయమన్నారు.

ఎస్టీపీల నిర్మాణంతోనే..

మూసీ అభివృద్ధిలో భాగంగా మూసీకి ఓఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంతో పాటు, మూసీలో మురికిని మొత్తం తీసివేసేలా ఎస్టీపీల నిర్మాణం కోసం ప్రణాళిక రూపొందించి, ఆ మేరకు రూ.3,800 కోట్లకు పైగా నిధులతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని… వీటి నిర్మాణం పూర్తి అయితే ఒక్క చుక్క కూడా మురికి నీరు మూసి లోకి చేరదన్నారు. దీంతోపాటు గోదావరి నుంచి నీళ్లు తీసుకువచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీలోకి మంచినీళ్లను వదలాలని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. దానికోసం కేవలం రూ.1100 కోట్లతో కొండపోచమ్మ నుంచి నీళ్లు తీసుకు వచ్చే అవకాశం ఉందని… కానీ ఇదే కార్యక్రమానికి అంచనాలను రూ.10 వేల కోట్లకి పెంచి రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ ద్వారా కరప్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నాడన్నారు. మూసీని సముద్రంగా అభివృద్ధి చేయడానికి తమకు వచ్చిన అంచనా వ్యయం కేవలం రూ.16,000 కోట్లు మాత్రమేనని… కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి లక్షల కోట్ల రూపాయల ఖర్చు మూసీ పైన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ప్రభుత్వం బఫర్ జోన్ పేరుతో ప్రజలను భయపెట్టి వారి ఇళ్లను కూలుస్తోందన్నారు. కేవలం డబ్బులు ఉన్న వాళ్లకే బఫర్ జోన్లు ఉంటాయా? రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంట బఫర్ జోన్‌లో ఉన్నది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? వాళ్ళ సోదరుడి ఇల్లు హైదరాబాద్‌లో బఫర్ జోన్‌లో ఉంది. మంత్రుల ఫామ్ హౌస్‌లు, ఇళ్లు బఫర్ జోన్‌లో ఉన్నా ఎందుకు వాటిపై చర్యలు తీసుకోవడం లేదని… ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 20 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్‌మెంట్‌లను, ఇళ్లను కూలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి.. మూసీ బఫర్ జోన్‌లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్‌మెంట్‌లను మాత్రం ముట్టుకోవడం లేదన్నారు. బఫర్ జోన్ లో ఉన్న వాటిని కులగోట్టి తిరిగి అవే బఫర్ జోన్లో భారీ భవనాలు కట్టేందుకు సిద్ధమయ్యాడన్నారు.

3,300 ఎకరాల భూమి పైన కన్నేసి

కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3,300 ఎకరాల భూమి పైన కన్నేసి మూసీ ప్రణాళికను తెరపైకి తీసుకువచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఈ మొత్తం భూముల విలువ రూ.1,50,000 కోట్లని …ఈ కోట్ల కోసమే రేవంత్ రెడ్డి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార ఆధారిత మూసీని రూపొందిస్తున్నారని ఆరోపించారు. డిజైన్ చేసే కంపెనీకే రూ. 160 కోట్లను ఇచ్చారంటే ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోవాలన్నారు. మూసీ బాధితుల ఇళ్లకు జీరో విలువ ఉందని బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగవద్దని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎవరికైనా జీరో విలువ ఉన్నది అంటే అది ముమ్మాటికీ రేవంత్ రెడ్డికే అని కేటీఆర్ అన్నారు. కేవలం రూ. 16,000 కోట్లతో 57 కిలోమీటర్ల మూసీని అభివృద్ధి చేయవచ్చని… వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రణాళికను ముందుకు తీసుకుపోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మూసీ బాధితుల ఆందోళన.. ఆవేదన

రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల పైన మూసీ బాధితులు ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ తమకు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విప్ వివేకానంద గౌడ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మన్నెగోవర్ధన్ రెడ్డి, పాల్గొన్నారు.