Mahaa Daily Exclusive

  మాజీ డీజీపీ ‘‘దొర’’కు ‘‘బండి’’ నివాళి..

Share

  • మాజీ డీజీపీ ‘‘దొర’’కు ‘‘బండి’’ నివాళి
  • రిటైర్డ్ డీజీపీ దొర సేవలను స్మరించుకున్న కేంద్ర మంత్రి
  • హెచ్.జె.దొర నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన బండి సంజయ్

హైదరాబాద్, మహా: ‘‘నిజాయితీ, క్రమశిక్షణ, ధైర్యానికి మారుపేరు మాజీ డీజీపీ హెచ్.జె.దొర అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొనియాడారు. నక్సలిజం నిర్మూలన కోసం నిరంతరం పనిచేస్తూ శాంతి భద్రతల రక్షణలో పోలీస్ వ్యవస్థకు గౌరవం తీసుకొచ్చిన అధికారి దొర అని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని హెచ్.జే.దొర నివాసానికి వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా హెచ్.జె.దొర కుమారుడు సత్యనారాయణ, కూతురు సాయిలీలతోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా హెచ్.జె.దొర సేవలను గుర్తు చేస్తూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘ఉమ్మడి ఏపీలో అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన హెచ్.జె.దొర కష్టపడి డిగ్రీ చదువుకోవడమే కాకుండా 1972 బ్యాచ్ IPSగా సెలెక్టై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ హోదాల్లో పని చేస్తూ డీజీపీగా సేవలందించడం గొప్ప విషయం. కష్టపడి నిజాయితీగా, నమ్మకంగా, క్రమశిక్షణతో పనిచేసిన అధికారి దొర’’ అని కొనియాడారు. ‘‘నిర్భయంగా నిజం చెప్పే నాయకత్వానికి ప్రతీక. పోలీస్ యూనిఫాం కు గౌరవం పెంచిన అధికారి. ప్రజాసేవలో కఠినత్వం, మనసులో మానవత్వం కలిగిన వ్యక్తి. యువ పోలీస్ అధికారులకు ఆదర్శంగా నిలిచిన సేవకుడు దొర’’అని అభివర్ణించారు. ‘‘నక్సలిజం నిర్మూలన విషయంలో ఎన్నడూ రాజీ పడని అధికారి దొర. ఆనాడు పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు ఆయనను చంపుతామని బహిరంగంగా ప్రకటించినా పట్టించుకోకుండా శాంతి భద్రతల విషయంలో రాజీపడకుండా పనిచేశారు’’అని తెలిపారు. డీజీపీగా రిటైర్డ్ అయిన తరువాత కూడా దేశానికి వివిధ రూపాల్లో సేవలందించారని గుర్తు చేశారు. ‘‘అలాంటి అధికారి మరణం బాధాకరం. ఉమ్మడి రాష్ట్ర పోలీసు విభాగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నా.’’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.