హైదరాబాద్, మహా : అమెరికాకు చెందిన కేంబ్రిడ్జ్ ఐసోటోప్ ల్యాబొరేటరీస్, స్థానిక కెమ్ తత్వ చిరల్ సొల్యూషన్స్ సంయుక్తంగా అధునాతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఈ కంపెనీలు వచ్చే మూడేళ్లలో రూ.300 కోట్ల పెట్టుబడి పెడతాయని ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ ఫేజ్–4లో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు.
ఆదివారం నాడు సచివాలయంలో తనతో సమావేశమైన రెండు కంపెనీల సిఇఓ లు పెట్టుబడులకు అంగీకరించారని ఆయన చెప్పారు. “లైఫ్ సైన్సెస్, స్పెషాలిటీ కెమికల్స్ రంగాల్లో తెలంగాణ ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదుగుతోంది. కేంబ్రిడ్జ్ ఐసోటోప్ ల్యాబొరేటరీస్, కెమ్ తత్వల భాగస్వామ్యం అంతర్జాతీయ కంపెనీలకు రాష్ట్రంపై ఉన్న ప్రగాఢ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ పెట్టుబడి ద్వారా అధునాతన కెమిస్ట్రీ, మెటీరియల్స్ రంగాల్లో రాష్ట్ర సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఈ అత్యాధునిక తయారీ కేంద్రంలో ఐసోటోప్ లేబుల్డ్ కాంపౌండ్స్ ఉత్పత్తి అవుతాయి. ప్రాజెక్టు పూర్తి అయితే దేశం వీటి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోగలుగుతుంది. ఔషధ పరిశోధనలు, జీవక్రియపై అధ్యయనాలు, రోగనిర్ధారణ పరీక్షలు, ఆధునిక ఎలక్ట్రానిక్స్, ఆర్గానిక్ ఎలక్ట్రో ల్యూమినిసెంట్ మెటీరియల్స్, సెమీకండక్టర్ రంగాల్లో ఇవి విస్తృతంగా ఉపయోగపడతాయి.
పరిశ్రమకు ఇక్కడ నెలకొని ఉన్న అనుకూల వాతావరణం, నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, అత్యున్నత మౌలిక సదుపాయాలు, మెరుగైన ప్రభుత్వ విధానాల కారణంగా జినోమ్ వ్యాలీలో పెట్టుబడి పెట్టాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి” అని శ్రీధర్ బాబు వివరించారు.
కేంబ్రిడ్జ్ ఐసోటోప్ ల్యాబొరేటరీస్తో భాగస్వామ్యం ద్వారా తెలంగాణలో ప్రపంచ స్థాయి తయారీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయగలమని కెమ్ తత్వ చిరల్ సొల్యూషన్స్ సీఈఓ డా. విశాల్ రాజ్పుత్ తెలిపారు. సమావేశంలో కేంబ్రిడ్జ్ ఐసోటోప్ ల్యాబొరేటరీస్ సీఈఓ క్లిఫ్ కాల్డ్వెల్, తెలంగాణా లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్ప తదితరులు పాల్గొన్నారు.








