- కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై?
- మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో
కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగింపు - జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం
జగిత్యాల, మహా : జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగింపు చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలను జీవన్‌రెడ్డి అనుచరులు సోమవారం తొలగించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో జీవన్‌రెడ్డికి విభేదాలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోందని జీవన్‌రెడ్డి కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్‌లో తనకు ప్రాధాన్యం దక్కట్లేదని ఆయన పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా తన పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడంతో చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీని వీడుతున్నారని వార్తలు వచ్చినా జీవన్ రెడ్డి ఎక్కడా స్పందించడం లేదు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలని డిసైడయినట్లు తెలుస్తోంది. ఈనెల 25న ఆయన బీఆర్ఎస్ లో చేరే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి బుజ్జగింపుయత్నాలు చేయగా, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా జీవన్ రెడ్డిని పలుమార్లు బుజ్జగించారు.
జీవన్ రెడ్డితో కలిసి పనిచేస్తా
మాజీమంత్రి జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవాలనట్లేదని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. జీవన్‌రెడ్డితో కలిసి పని చేయాలనుకుంటున్నానని, జీవన్‌రెడ్డి ఆలోచన ఏముందో నాకు తెలియదని పేర్కొన్నారు.







